భక్తిశ్రద్ధలతో ముగిసిన చండీ సహిత రుద్ర హోమ పూర్ణాహుతి
మచిలీపట్నం:
స్థానిక సర్కిల్ పేటలో కొలువై ఉన్న శ్రీ కంచి కామాక్షి కాళికాంబ అమ్మవారి దేవాలయంలో చండీ సహిత రుద్ర హోమ మహా కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, లోక కల్యాణం, సర్వ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు.
శ్రీ తనికెళ్ల త్రినాధ శర్మ బ్రహ్మత్వంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ చండీ సహిత రుద్ర హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమాన్ని కొరపాటి శ్రీనివాస్ దంపతులు నిర్వహించారు. హోమ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు భక్తి భావంతో అమ్మవారిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమ సమయంలో ఆలయ ప్రాంగణం వేద మంత్ర ధ్వనులతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి హోమ కార్యక్రమాన్ని వీక్షించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పూర్ణాహుతి అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

