ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది – మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జవాబుదారీతనంతో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.శనివారం సాయంత్రం మంత్రి మచిలీపట్నం నగరంలోని బృందావన్ థియేటర్ పక్కన ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చిన అర్జీలను పరిశీలించి, పరిష్కారం సాధ్యమైన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ రోజు అందిన 72 అర్జీలలో 56 సమస్యలు పరిష్కార పరిధిలో ఉండగా, మిగిలిన 16 అంశాలు వివిధ శాఖల పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 408 అర్జీలు అందగా, వాటిలో 318 సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మిగిలిన సమస్యలను కూడా సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సామాజిక భద్రతా పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రైతులకు అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి కొనసాగిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
అర్జీలలో కొన్ని
మచిలీపట్నం నగరంలోని వలందపాలెం, గంగులతోట రోడ్డులో ఉన్న మౌనిక గ్రీన్ సిటీ కాలనీ వాసులు తమ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో సుమారు 125 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ మురుగు నీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తరచూ విషజ్వరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రహదారులు దెబ్బతిన్నాయని, వీధి దీపాలు సరిగా పనిచేయడం లేదని తెలిపారు. కాలనీవాసుల సౌకర్యార్థం డ్రైనేజీ వ్యవస్థ, రహదారి మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కాలనీ అధ్యక్షుడు లంకపల్లి రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు.
మచిలీపట్నం నగరంలోని మాచవరం ప్రాంతానికి చెందిన మోతుకూరి వెంకటేశ్వరమ్మ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు వినతిపత్రం సమర్పించారు. 2023లో కుడికాలుకు శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, ప్రస్తుతం ఇతరుల సహాయం లేకుండా నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. తనకు అండగా కుమారుడు మాత్రమే ఉన్నాడని, కుటుంబ పోషణతో పాటు వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుతున్న రూ.4 వేల పెన్షన్ జీవనోపాధికి సరిపోవడం లేదని, తన దయనీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రూ.15 వేల ప్రత్యేక పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, మధు, తలారి సోమశేఖర్, కే సుశీల తదితర నాయకులు పాల్గొన్నారు.

