మచిలీపట్నంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్
రూ.8.5 లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనం
మచిలీపట్నం:
మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. పాండురంగ హైస్కూల్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో వారి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
అరెస్టయిన నిందితులు కైకలూరు ప్రాంతానికి చెందిన షేక్ కాజా మొయిద్దీన్, షేక్ ఇమామ్ షరీఫ్‌గా గుర్తించారు. వీరిద్దరూ పాత నేరస్థులని పోలీసులు వెల్లడించారు.నిందితుల వద్ద నుంచి సుమారు 60 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు, వాటి విలువ సుమారు రూ.8.5 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సీసీఎస్, మచిలీపట్నం పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

