కూచిపూడిని అంతర్జాతీయ నాట్య కళా పీఠంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
SSN
- February 28, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
ప్రముఖ నాట్య క్షేత్రమైన కూచిపూడిని అంతర్జాతీయ నాట్య కళా పీఠంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఇందుకోసం ప్రణాళిక రూపొందిస్తామని అమరజీవి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడు పేర్కొన్నారు.
శనివారం మధ్యాహ్నం ఉపకులపతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో నగరంలోని వారి చాంబర్లో కూచిపూడి అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చెప్పిన అంశాలకు సమ్మతి తెలుపుతూ అన్ని విధాల సౌకర్యాలు కల్పించి కూచిపూడి నాట్యకళా పీఠాన్ని అంతర్జాతీయ నాట్య కళా పీఠంగా తీర్చి దిద్దుతామన్నారు. వేసవికాలంలో కోర్సులను 15 రోజులు, 21 రోజులు, మూడు నెలల కోర్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆన్లైన్ కోర్సులను కూడా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
ఆడిటోరియం నిర్మించి అందులో కనీసం 50 గదులను ఏర్పాటు చేసి వసతి కల్పిస్తామన్నారు. త్వరలో అంతర్జాతీయ ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కూచిపూడి లోని శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళా పీఠం లో వృత్తిపరంగానే కాకుండా కొంతమంది అభిరుచిగా కూడా నేర్చుకునేందుకు వస్తున్నారన్నారు. అయితే అక్కడ రెగ్యులర్ కోర్సులే కాకుండా 15 రోజులు, నెల, రెండు నెలలు కోర్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఆ విధంగా చేయడం వలన ఎంతోమంది ప్రముఖులకు కూడా కూచిపూడి నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు.
అంతేకాకుండా అక్కడ ఒక ఆడిటోరియం నిర్మించి వసతి కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం ఒక వాస్తు శిల్పిని గుర్తించి వారి ద్వారా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల నుండి సిఎస్సార్ నిధులు, దాతల నుండి ఫౌండేషన్ లను సంప్రదించి కావాల్సినన్ని నిధులు సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు.
కూచిపూడి గ్రామంలో రాష్ట్రీయ గ్రామీ స్వరాజ్ అభియాన్( ఆర్ జి ఎస్ ఏ) కింద 50 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రహదారులు నిర్మించడం జరుగుతుందని, త్వరలో పూర్తికానున్నాయన్నారు..
కూచిపూడి నేర్చుకున్న ప్రముఖుల జాబితాను కూడా సేకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి ఏ ఏ పథకాలు జిల్లాకు పనికి వస్తాయో వాటి వివరాలు సేకరించాలన్నారు. పి…ఫోర్ లో భాగంగా 12 కుట్టుమిషన్లను మహిళలకు అందజేయడం జరిగిందన్నారు. గ్రామంలో మురుగునీటి వ్యవస్థ మెరుగుపరిచేందుకు 22 లక్షల రూపాయల వ్యయంతో ప్రతిపాదనలను సిఆర్డిఏ కి పంపామని వారి నుండి నిధులు రాగానే పనులు మొదలు పెడతామన్నారు
ఈ సమావేశంలో కలెక్టర్ ఛాంబర్ నుండి జడ్పీసీఈఓ కే.కన్నమ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర, జిల్లా పర్యాటక అధికారి రామ లక్ష్మణ్, భూగర్భ జల శాఖ అధికారి బిందు శ్రీ,, కూచిపూడి తహసిల్దారు మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, కూచిపూడి నాట్య కళాకారులు వెంపటి సత్య ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి అంకబాబు, స్థానిక నాయకులు అమరబలేశ్వరరావు, ఆన్లైన్లో ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, టూరిజం కన్సల్టెంట్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

