MachilipatnamLocal News
October 25, 2026
విద్య - ఉపాధి

ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు టీచర్స్ ఎంఎల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి: PTLF రాష్ట్ర అధ్యక్షురాలు డి. ప్రసన్న

  • October 25, 2026
  • 1 min read
ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు టీచర్స్ ఎంఎల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి: PTLF రాష్ట్ర అధ్యక్షురాలు డి. ప్రసన్న

మచిలీపట్నం:

కృష్ణా-గుంటూరు జిల్లాల పరిధిలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధకులంతా టీచర్స్ ఎంఎల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్ (PTLF-AP) రాష్ట్ర అధ్యక్షురాలు డి. ప్రసన్న పిలుపునిచ్చారు. ఆదివారం మచిలీపట్నం జిల్లా కోర్టు సమీపంలోని సి.వి. రామన్ అకాడమీ ఆవరణలో PTLF ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టీచర్స్ ఎంఎల్సీ ఓటర్ల ఎన్రోల్మెంట్ హెల్ప్ లైన్ సెంటర్’ మరియు ‘ఉచిత ఎన్రోల్మెంట్ క్యాంప్’ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గతంలో ఉన్న పాత ఓటర్ల జాబితా ఇప్పుడు చెల్లదని, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఫారం-19 ద్వారా కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ హైస్కూళ్లు, జూనియర్, డిగ్రీ, టెక్నికల్, ఒకేషనల్ కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

PTLF రాష్ట్ర కన్వీనర్ కాగిత శంకర సాంబశివరావు మాట్లాడుతూ, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈ ఓటు హక్కు లభించిందని, రాజ్యాంగం ఉపాధ్యాయులకు మాత్రమే ఇటువంటి ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి బొక్కా అయ్యప్ప స్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ యజమాన్యాల నుంచి అవసరమైన సర్వీస్ సర్టిఫికెట్లు పొందేలా ఫెడరేషన్ పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ రాజ్యాంగ హక్కును ప్రైవేట్ బోధకులందరూ వినియోగించుకోవాలని జిల్లా అధ్యక్షుడు కూరేటి జగన్ కోరారు.

టీచర్స్ ఎంఎల్సీ ఓటు అర్హతలు & వివరాలు:
* అర్హత: భారత పౌరుడై, కృష్ణా-గుంటూరు పరిధిలో నివసిస్తూ, నవంబర్ 1, 2026 నాటికి గత 6 ఏళ్లలో కనీసం 3 ఏళ్లు (10వ తరగతి లేదా ఆపై స్థాయి) గుర్తింపు పొందిన సంస్థలో బోధించిన ప్రైవేట్ టీచర్లు/లెక్చరర్లు అందరూ అర్హులే.
* కావలసిన పత్రాలు: ఫారం-19 (Form-19), హెచ్‌ఎమ్/ప్రిన్సిపాల్ సంతకంతో సర్వీస్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ మరియు నివాస ధ్రువీకరణ పత్రం.
* హెల్ప్ లైన్ సెంటర్: సి.వి. రామన్ అకాడమీ, NGO హోమ్ ప్రక్క సందు, జిల్లా కోర్టు సమీపం, మచిలీపట్నం (ప్రతిరోజు సాయంత్రం 6:00 నుండి 9:00 వరకు).
* సంప్రదించాల్సిన నంబర్లు: 9391866888, 9966419220.

ఈ కార్యక్రమంలో PTLF నాయకులు బెల్లంకొండ లక్ష్మణ్, అబ్బాస్, పి.రాము, కేదారనాథ్, జనార్ధన్, విజయ్, గీతాంజలి, అరుణ, మాధవి, భాగ్యలక్ష్మి, ఏంజెల్, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN