‘చిత్రసౌరభాలు’ పద్య కవితా సంపుటి ఆవిష్కరణ – ఒక ప్రత్యేక సాహిత్య సంచలనం!
ఏలూరు:
సాహితీ లోకంలో సరికొత్త ప్రయోగానికి ఏలూరు వేదికైంది. ఏలూరులోని జ్యూయలర్ అసోసియేషన్ హాలులో ప్రముఖ కవయిత్రి డా. ఓలేటి ఉమాసరస్వతి రచించిన వినూత్న పద్య కవితా సంపుటి ‘చిత్రసౌరభాలు’ ఘనంగా ఆవిష్కరించబడింది. హైదరాబాద్ క్రైం బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ యర్రోజు కిరణ్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, రచయిత్రిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో పుస్తక సమీక్షకులుగా విచ్చేసిన టి. రామలక్ష్మణాచార్యులు మాట్లాడుతూ… ఒక చిత్రానికి తగిన పద్యం అల్లడం, దానిని గ్రంథస్తం చేయడం సాహిత్య రంగంలో ఒక నూతన ప్రక్రియ అని కొనియాడారు. ఇందులో ఎక్కువగా ఉపయోగించిన సీసా పద్యాలు మరియు తేటగీతులు చక్కని పద్య నడకను కలిగి ఉన్నాయని తెలిపారు. పద్యాలు ఎంతో సరళమైన శైలిలో ఉండటం వల్ల విద్యార్థులకు కూడా సులభంగా అర్థమవుతాయని, పిల్లలలో చిత్రాలను చూసి పద్యాలు రాసే సృజనాత్మకతకు ఇది గొప్ప ప్రేరణనిస్తుందని అభిప్రాయపడ్డారు. తాత్వికత, భక్తి, ప్రకృతి సౌందర్య వర్ణన, సమాజహితం, స్త్రీ శక్తి పథకం వంటి వైవిధ్యభరితమైన చక్కని అంశాలను ఎంచుకుని ఈ పద్య సంపుటిని రూపుదిద్దడం విశేషం. ఈ సుందరమైన పద్య కవితా సంపుటిని కాశీ లక్ష్మీ మాణిక్యం గారికి రచయిత్రి అంకితం ఇచ్చారు.
ఈ సాహిత్య వేడుకలో ఒరిస్సా సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ చండ్రపాటి నాగవరప్రసాద్, జి. కూర్మాచార్యులు తదితర ప్రముఖులు, సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమ దిగ్విజయానికి తోడ్పడ్డారు.

