MachilipatnamLocal News
October 23, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘మేధో సంపత్తి హక్కుల’పై అవగాహన సదస్సు

  • October 23, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘మేధో సంపత్తి హక్కుల’పై అవగాహన సదస్సు

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయంలో ‘మేధో సంపత్తి హక్కులు’ (ఐపీఆర్) అనే అంశంపై శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (నోడల్ ఏజెన్సీ), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్ – అమలు సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో, ప్రపంచ బ్యాంకు సహకారంతో ‘రైజప్ ఎంఎస్ఎంఈ X ర్యాంప్’ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం-2020 (ఎన్ఈపీ 2020) ప్రకారం విద్యార్థులు ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్విభాగ, బహుళ విభాగాల కోర్సులను అభ్యసించడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విస్తృతమైన జ్ఞానం, విభిన్న రంగాలపై అవగాహన విద్యార్థుల భవిష్యత్తుకు మరియు వృత్తిపరమైన అవకాశాలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన వివరించారు.

విద్యార్థుల కెరీర్ అభివృద్ధి నూతన ఆవిష్కరణలతో ముడిపడి ఉందని, తమ ఆవిష్కరణలను సమర్థవంతంగా తెలియజేయడం, ప్రచురించడం, అవార్డులు సాధించడం మరియు వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకురావడంపై యువత దృష్టి సారించాలని వీసీ సూచించారు. మేధో సంపత్తి హక్కుల ప్రాముఖ్యతను గుర్తించి, తమ సృజనాత్మక ఆలోచనలకు తగిన రక్షణ పొందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాప్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆదాయాన్ని సృష్టించే అవకాశాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు కేవలం సాంకేతికతను ఉపయోగించేవారిగానే కాకుండా, కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలతో దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే సృష్టికర్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుందర్ కృష్ణ, ప్రొఫెసర్ బాబు రెడ్డి, ప్రొఫెసర్ కిరణ్ కుమార్, డాక్టర్ విజయకుమారి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇన్నోవేషన్ అసోసియేట్ శ్రీ డేవిడ్ జాన్సన్, ఐపీఆర్ నిపుణులు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN