ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: పౌర సరఫరాల అధికారి తాటి శివరామప్రసాద్
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలో 2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మచిలీపట్నంలోని రైస్ మిల్లర్ల సంఘం భవనంలో శనివారం జిల్లా పౌర సరఫరాల అధికారి తాటి శివరామప్రసాద్ అధ్యక్షతన క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం, సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,441, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ. 2,461 చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించారు. ధాన్యం సేకరించిన అనంతరం రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రైతులు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రద్దీని నివారించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్ ముందస్తు సమయ కేటాయింపు సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రైతులు స్వయంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నా లేదా రవాణా ఖర్చులు భరించినా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హమైన నిధులను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తామని తెలిపారు.
ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులు, కూలీలు, రవాణా వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఎక్కడా కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్ పరికరాలను అమర్చి, రవాణా ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించాలని సూచించారు. మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానంపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం నార్త్ తహశీల్దార్ నాగభూషణం, సౌత్ తహశీల్దార్ రామశివ, అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ ప్రధాన్, గ్రామ వ్యవసాయ సహాయకులు, సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టోడియన్ అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు మరియు ధాన్యం సేకరణ సిబ్బంది పాల్గొన్నారు.

