కోతి నియమం!
ఒక అడవిలో పెద్ద మామిడి చెట్టు కింద దిగాలు గా కూర్చొని ఉన్న కోతిని చూసి అటుగా వెళుతున్న కుందేలు " ఏమైంది మిత్రమా! ఎందుకు అలా దీనంగా కూర్చున్నావు? "
అనగా "మిత్రమా! కుందేలు ఈ రోజు నాకు ఆహారం దొరకక పోవడంతో ఏమీ తినలేదు, ఓపిక లేక నీరసంగా ఉండడంతో ఎక్కడికి వెళ్ళలేక ఇలా కూర్చున్నాను"అంది కోతి.
"ఇంత పెద్ద అడవిలో ఎంత ఎత్తు చెట్టునైనా సునాయాసంగా ఎక్క గల నీకే ఆహారం దొరక లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందే?" అని కుందేలు అనగా
"లేదు మిత్రమా! అడవిలో ఆహారానికి వచ్చిన కొరత ఏమీ లేదు కానీ నేను ఏ ఒక్క చెట్టు నుంచి ప్రత్యక్షంగా పండ్లను కోయ కూడదు అని నిర్ణయించుకుని కేవలం చెట్లు రాల్చిన పండ్ల ను మాత్రమే తీసుకోవాలని నియమం పెట్టుకున్నాను! అందువల్ల ఈ రోజు నేను వచ్చిన దారిలో ఏ చెట్టు దగ్గర పండ్లు రాలి పడి ఉండలేదు అందుకే ఆహారం తినలేదు" అనగా
"మిత్రమా! ఎందుకని ఈ విధంగా నియమం పెట్టుకున్నావు ఇలా అయితే నీకు ఆహారం దొరికినట్టే!"
అనగా "మిత్రమా! కుందేలు మన ఏదైనా భాగానికి దెబ్బ తగిలితే ఎలా నొప్పితో బాధ పడతామో, చెట్లు కూడా అంతే వాటి యొక్క పండ్లను శరీరంలో బలవంతంగా కోస్తే అవి కూడా బాధ పడతాయి! నిజానికి ఆ పండ్లు దాని ఆహారం. అది దానికి అవసరమైనప్పుడు వినియోగించుకుంటుంది. లేనప్పుడు లేదా పండి పోయినప్పుడు వాటంతట అవే రాలిపోతాయి! మన ప్రమేయం లేకుండా కూడా ఒక్కొక్కసారి బలమైన గాలులు వీయడం వల్ల అవి రాలి పడతాయి! అప్పుడు మాత్రమే వాటిని తీసుకుని తినాలి" అనగా
"అయ్యో కోతి బావ ఇలాంటి నియమాలు పెట్టుకుంటే ఈ అడవిలో జంతువులకు ఆహారం దొరికినట్టే" అనగా
ఈ సంభాషణను వింటూ ఆ జంతువుల వెనకే ఉన్న మామిడి చెట్టు ఆనందంతో మురిసిపోయింది. 'జంతువులలో కూడా మా యొక్క బాధను అర్థం చేసుకునే జంతువులు ఉన్నాయా?' అనుకుని మనసులో కోతికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంతోషంతో తన చెట్టు కొమ్మలను ఊపి కొన్ని కాయలను రాల్చింది.
అది చూసిన కుందేలు ఆశ్చర్యపోతూ "ఇప్పుడు గాలి వేయలేదు కానీ చెట్టు తనంతట తాను కొమ్మలను ఊపి కాయలను భలే రాల్చిందే?" అని " కోతి మిత్రమా నువ్వు చెప్పింది నిజమే మనం ఇతరులకు మేలు చేయకపోయినా తెలిసి తెలిసి హాని కలిగించనంత వరకు మనకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతూనే ఉంటుంది" అంది.
ఆ తర్వాత ఇద్దరు కిందపడిన మామిడికాయలు తిని ఆనందంగా ఇంటిదారి పట్టారు.
ఏడుకొండలు కళ్ళేపల్లి
మచిలీపట్నం
9490832338


