MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు: మచిలీపట్నం ‘గేట్‌వే ఆఫ్ అమరావతి’గా ఆవిష్కరణ కానుంది – జిల్లా టూరిజం అధికారి జి.రామలక్ష్మణ్

  • September 27, 2026
  • 1 min read
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు: మచిలీపట్నం ‘గేట్‌వే ఆఫ్ అమరావతి’గా ఆవిష్కరణ కానుంది – జిల్లా టూరిజం అధికారి జి.రామలక్ష్మణ్

మచిలీపట్నం:

దేశ ఆర్థిక వనరులు పెరగడంలో పర్యాటక రంగం (టూరిజం) కీలక పాత్ర పోషిస్తుందని కృష్ణా జిల్లా టూరిజం శాఖ అధికారి జి. రామలక్ష్మణ్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామలక్ష్మణ్ మాట్లాడుతూ… సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలు కేవలం పర్యాటక రంగం ఆధారంగానే విశేష అభివృద్ధి సాధించాయని గుర్తుచేశారు. ప్రస్తుతం భారతదేశంలో కూడా ప్రభుత్వాలు టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు. మన చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రాంతాలను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే మచిలీపట్నం ‘గేట్‌వే ఆఫ్ అమరావతి’గా రూపుదిద్దుకోబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మి మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విద్యార్థులు విద్యార్థి దశలోనే వాటిని సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థినులు చాలా చక్కగా సమాధానాలు రాశారని అభినందించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు – సన్మానం:

ఈ వేడుకల్లో భాగంగా వలందపాలెం లోని మహాత్మా జ్యోతిరావు పూలే బిసి సంక్షేమ నివాస పాఠశాలలో ‘హెరిటేజ్ వాక్’ మరియు సాంప్రదాయ ‘కోలాట నృత్యం’ నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు టూరిజం శాఖ తరఫున జ్ఞాపికలు (మెమంటోలు) అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివశంకర్, అధ్యాపకులు విజయశ్రీ, లక్ష్మీ మనోహరం, శ్రీనివాస్, మున్వర్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

About Author

SSN