ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మచిలీపట్నం:
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ బీ విద్యాసాగర్ నాయుడు, శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్ తో కలసి పమిడిముక్కల మండలంలో ముందస్తు భద్రత సమన్వయ ( ఏ ఎస్ ఎల్) ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం వారు పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెలికాప్టర్ క్రిందకు దిగినప్పుడు హెలీప్యాడ్ చుట్టూ మట్టి, దుమ్ము, ధూళి పైకి లేవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సరైన వెలుతురు కోసం విద్యుత్ దీపాలు, సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. పాములు, తేనె తుట్టెలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలన్నింటిలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగాక హెలిపాడ్ వద్ద కొంతమంది ప్రముఖులు, అధికారులు ఆహ్వానం పలుకుతారన్నారు.

తదుపరి ముఖ్యమంత్రి ప్రజా వేదిక వద్దకు చేరుకొని మొదట కార్మికుల అడ్డా చేరుకొని అక్కడ కార్మికులతో మనమిత్ర యాప్ కు అనుసంధానంగా కార్మిక శాఖ రిజిస్ట్రేషన్ యాప్ లను ప్రారంభిస్తారన్నారు. అక్కడి ప్రదర్శనశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్మిక శాఖ అభివృద్ధి నివేదిక ప్రదర్శిస్తారన్నారు. ప్రజలను ఉద్దేశించి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారన్నారు.
పి ..4 మార్గదర్శి ముఖ్యమంత్రికి మెగా చెక్కు అందజేస్తారన్నారు. కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేస్తారన్నారు. అనంతరం సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడతారన్నారు. వీరంకి లాకులలోని ఎన్టీఆర్ కాలనీలో పింఛను లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి పింఛన్లు పంపిణీ చేస్తారన్నారు. భవన నిర్మాణ ప్రదేశంలో కార్మికులతో ముఖాముఖి మాట్లాడిన అనంతరం క్యాడర్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు.
తదనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో బయలుదేరి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల చేరుకుని అక్కడ డాక్టర్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను ప్రారంభిస్తారన్నారు. తదుపరి అక్కడి నుండి ఇంజనీరింగ్ కళాశాల చేరుకుని హెలిక్యాప్టర్లో ఉండవల్లికి బయలుదేరి వెళ్తారన్నారు. ప్రజా వేదికకు ప్రజలను తీసుకువచ్చే బస్సులు, ఆటోలు ,విఐపి వాహనాలకు వేరువేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు ఆహారము సరఫరా చేయాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన వాహనాలను పరికరాలను అన్నిచోట్ల సిద్ధంగా ఉంచుకోవాలన్నారు
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట రాష్ట్ర కార్మిక శాఖ వైద్య బీమా కమిషనర్ శ్రీ ఆంజనేయులు, సీఎం భద్రత అధికారులు అదనపు ఎస్ పి. రమణ, డిఎస్పి పోతురాజు, అదనపు ఎస్పీలు వివి నాయుడు సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యక్రమం సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ఉయ్యూరు ఇంచార్జ్ ఆర్డిఓ బాలసుబ్రమణ్యం, కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశాలత, డి సి ధనలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్ అగ్నిమాపక అధికారి ఏసురత్నం, డ్వామా పిడి శివప్రసాద్, సి పి డి సి ఎల్ ఎస్ ఇ రవీంద్రబాబు, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ శేషు కుమార్, డి ఆర్ డి ఎ పి డి హరినాథ్, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకులు గంగాధర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ. సోమశేఖర్, డీఎస్ఓ మోహన్ బాబు, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, పౌరసరఫరాల సంస్థ డీఎం శివరాం ప్రసాద్, డి సి ఓ చంద్రశేఖర్, ఎన్ఐసి అధికారి ఫణి కుమార్ ఆర్ & బి ఈఈ లోకేష్, డి ఈ బలరాం కార్మిక శాఖ ఏసి విష్ణు, డి ఎల్ డి ఓ రాజేష్ డి ఎల్ పి ఓ సంపత్ కుమారి, గుడివాడ డిఎస్పి పి శ్రీనివాస్, ఇంటిలిజెన్స్ డిఎస్పి సిహెచ్ రాజా, తహసిల్దారులు నవీన్, సురేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

