అధికార పార్టీ జనసేన తన పంతం నెగ్గించుకుంది… కానీ!?
SSN
- March 14, 2026
- 1 min read
[addtoany]
సముద్ర తీరంలో ఉన్న మచిలీపట్నం ప్రశాంతతకు పెట్టింది పేరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. నగరం దాదాపు ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగినా ఎన్నికల అనంతరం పార్టీల సైద్ధాంతిక వైరమే గాని వ్యక్తిగత వైరాలు కనిపించవు. కానీ 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగర రాజకీయాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ తీరు పలు సందర్భాల్లో వివాదాస్పదమవుతూ వార్తల్లో నిలుస్తుంది.
మచిలీపట్నంలో జనసేన బహు నాయకత్వంలో ఉంది. నాయకులు ఎవరికి వారే పార్టీకి అంతా మేమే అనే ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. వారిలో వారే గొడవపడి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సందర్భం కూడా లేకపోలేదు.
2024 కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం జనసేన నాయకులు నగరంలో పలు సందర్భాలలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఫలితాల అనంతరం విద్యుత్ శాఖ అధికారిపై కొంతమంది జనసేన నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సోషల్ మీడియా పోస్ట్ వివాదంలో ఆ అధికారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి బలవంతంగా క్షమాపణ చెప్పించి, పవన్ కళ్యాణ్ ఫోటోకి పాలాభిషేకం చేయించారు.
అలాగే బందరు మండలం మోడీ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ పవన్ కళ్యాణ్ ను విమర్శించాడని, ఆయన ఇంటి పై జనసేన నాయకులు, కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేసి, డాక్టర్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పించారు.
పోలీసు హోంగార్డు లేచి తనకు నమస్కారం చేయలేదని.. జనసేన నాయకుడు ఆ హోంగార్డుపై దాడి చేసి గాయపరిచాడు అనే ఆరోపణలతో, సదరు జనసేన నాయకుడు అరెస్టు అయ్యాడు. తదనంతర పరిణామాలతో ఆ నాయకుడిని జనసేన పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లుగా పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ ప్రకటించారు.
గురువారం సాయంత్రం రామానాయుడుపేట సెంటర్లో జెండా దిమ్మ విషయంలో వివాదం చెలరేగింది. జనసేన నాయకుడు సెంటర్లో జెండా దిమ్మ కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా వైసీపీ నాయకులు ఇక్కడ కట్టడానికి వీలు లేదని అడ్డు పడ్డారు. మృదుస్వభావి, వివాదరహితుడు అయిన మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ సైతం తన పంథాను వీడి, ఘర్షణలో పాల్గొని మేము దేనికైనా సిద్ధం అని ప్రకటించడం మచిలీపట్నం ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఆ సందర్భంలో పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలతో సస్పెండ్ అయిన నాయకుడు బండి రామకృష్ణ వెనకవైపునే ఉండి రామకృష్ణకి జై కొట్టడం చూస్తే పార్టీలో ఏ స్థాయి క్రమశిక్షణ ఉందో ఇట్టే అర్థమవుతుంది.
శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామానాయుడుపేట సెంటర్లో పదుల సంఖ్యలో పోలీసులను మోహరించి, సెక్షన్ 30 అమలులో ఉన్నా, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చి జెండా ఎగురవేసి తమ పంతం నెగ్గించుకున్నారు.
ప్రతిపక్షం లో ఉండటానికి అధికారపక్షంలో ఉండటానికి చాలా తేడా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ఎంతో బాధ్యతగా ఉండాలి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడవలసిన జనసేన నేతలు… వారి నాయకుని విమర్శించిన వారి మీద దాడి చేయడానికి, విమర్శకుల ఇళ్లలో వస్తువులను ధ్వంసం చేయడానికి, పార్టీ జెండా దిమ్మలు కట్టడానికి అధికారాన్ని ఉపయోగించటం శోచనీయం.
నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు వారి వారి గుర్తింపు కోసం క్రమశిక్షణను మరచి ఇష్టారీతిలో వ్యవహరించడం జనసేన పార్టీని తీవ్ర విమర్శలకు గురిచేస్తుంది. కూటమి పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జనసేన తన మెరుగైన సేవలతో ప్రజలకు మరింత చేరువ కావడం మరచి తరచుగా ఇలా వివాదాల్లో ఉండటం నగరంలో చర్చనీయాంశం అవుతుంది.
శ్యామ్ కాగిత
మచిలీపట్నం
నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు వారి వారి గుర్తింపు కోసం క్రమశిక్షణను మరచి ఇష్టారీతిలో వ్యవహరిస్తూ జనసేన పార్టీని విమర్శలకు గురిచేస్తుంది. కూటమి పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకుంటున్న జనసేన తన మెరుగైన సేవలతో ప్రజలకు మరింత చేరువ కావడం మరచి తరచుగా ఇలా వివాదాల్లో ఉండటం నగరంలో చర్చనీయాంశం అవుతుంది.
శ్యామ్ కాగిత
మచిలీపట్నం

