మచిలీపట్నం:
జిల్లాలో వివిధ పథకాల కింద చేపట్టిన మరుగు దొడ్లు, మంచినీటి సదుపాయాల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి వివిధ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు 2900 నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 2101 పూర్తి చేశారని మిగిలినవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు.
అలాగే 490 సామాజిక పారిశుధ్య సముదాయాలు మంజూరు కాగా అందులో 184 సముదాయాలు పూర్తయ్యాయని మిగిలినవి కూడా సత్వరమే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రే వాటర్ మేనేజ్మెంట్ కింద మంజూరైన 768 మేజిక్ డ్రైన్ల నిర్మాణపు పనులను వెంటనే మొదలు పెట్టాలన్నారు.
అంగన్వాడి కేంద్రాలలో 61 మరుగుదొడ్లు, మంచినీటి నిర్మాణం పనులు మంజూరు కాగా అందులో 13 పూర్తి కాగా 36 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వాటిని కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు.
వర్షపు నీటి నిల్వ కోసం 702 నిర్మాణ పనులు మంజూరు కాగా అందులో ఇప్పటివరకు 672 పనులు పూర్తయ్యాయన్నారు.
ఎంపీ లాడ్స్ కింద 19 అభివృద్ధి పనులు మంజూరు కాగా అందులో 14 పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలినవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు.
పీఎంఏజీవై పథకం కింద 6 పనులు మంజూరు కాగా అందులో 4 పనులు పురోగతిలో ఉన్నాయని వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు.
సి ఎస్ ఆర్ నిధులు 9 కోట్ల రూపాయలతో 56 పనులు మంజూరు కాగా అందులో 39 పనులు పూర్తయ్యాయని మిగిలినవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు.
జిల్లాలో జలజీవన్ మిషన్ కింద 455 పనులు మంజూరు కాగా అందులో ఇప్పటివరకు 95 పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ సోమశేఖర్, డి ఈ ఈ లు నటరాజు, సుధాకర్, సత్యనారాయణ పలువురు ఏఈలు పాల్గొన్నారు.