జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల్లో ‘పురిటిగడ్డ ఉన్నత పాఠశాల’ విద్యార్థినుల ప్రతిభ
అంగలూరు/పురిటిగడ్డ :
జనాభా విద్య కార్యక్రమంలో భాగంగా ఎస్సిఈఆర్టి (SCERT) ఆధ్వర్యంలో శనివారం అంగలూరు జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్) నందు జిల్లా స్థాయి జానపద నృత్య మరియు పాత్ర పోషణ (రోల్ ప్లే) పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ పోటీలలో పురిటిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విశేష ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారు.
సమాజంలో ఎంతో కీలకమైన “మానసిక ఆరోగ్యం” అనే విశిష్టమైన ఇతివృత్తాన్ని తీసుకుని, “గోదావరి…” అనే పాటకు విద్యార్థినులు డి. కల్యాణి కీర్తన, ఎన్. కావ్య, ఎమ్. డాలి అక్షయ, కె. నందినీ బాయి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చి న్యాయ నిర్ణేతలను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి అభినందనలు:
పోటీల్లో ప్రతిభ చాటి ద్వితీయ బహుమతి సాధించిన విద్యార్థినులను, వారిని ఎంతగానో ప్రోత్సహించి, నృత్యం నేర్పించి పోటీలకు తీసుకువెళ్లిన పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. బి. ఎన్. శర్మ, మండల విద్యాశాఖాధికారి పి. వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలకు, మండలానికి పేరు తెచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయినికి పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

