MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

మూడవ రోజుకు చేరుకున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు

  • October 8, 2026
  • 1 min read
మూడవ రోజుకు చేరుకున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు

మచిలీపట్నం: 

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మచిలీపట్నం న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో పలువురు మహిళా న్యాయవాదులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.

మచిలీపట్నం న్యాయవాద సంఘం అధ్యక్షులు శ్రీ తుంగల హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీక్షలో సంఘ ప్రధాన కార్యదర్శి సర్వా లలిత కుమారితో పాటు న్యాయవాదులు జగతిశ్రీ, రెహానా, రష్మీ, సనత్, భారతి, లావణ్య, నాగమణి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి సీనియర్ న్యాయవాదులు రావి వెంకటరావు, మహమ్మద్ రఫీ, నగధరనాథ్, విజయబాబు తదితరులు ప్రసంగించి న్యాయవాదుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. న్యాయవాదులపై వివిధ సందర్భాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, వారి భద్రతకు సంబంధించిన సమస్యల నేపథ్యంలో ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం అవసరమని వారు పేర్కొన్నారు.

అదేవిధంగా వైసీపీ నాయకులు పేర్ని కిట్టు, నోబుల్, అభిమన్యు తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి న్యాయవాదులకు మద్దతు తెలిపారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన ఆవశ్యకతను వారు వివరించారు.

న్యాయవాదుల భద్రతకు చట్టపరమైన రక్షణ కల్పించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని న్యాయవాదులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ నిరసనలకు ప్రభుత్వం స్పందించి న్యాయవాద రక్షణ చట్టం అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

About Author

SSN