మచిలీపట్నం :
కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో షహీద్ దివస్ పేరిట అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా ఆర్ విజయ్ కుమారి మాట్లాడుతూ 1931 లో నిస్వార్ధంగా స్వాతంత్ర పోరాటంలో ప్రజల పక్షాన పోరాడుతున్న భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు వంటి యోధులను బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశంగా ఉరి తీసిన వైనాన్ని నిరసిస్తూ ప్రతి సంవత్సరం భారతీయులందరూ అమరవీరుల దినోత్సవాన్ని ఒక సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్న విషయాన్ని విద్యార్థులకు విశదీకరించారు.
ఆ ఘటన జరిగిన సమయానికి భగత్ సింగ్ కి కేవలం 23 ఏళ్లు మాత్రమేనని, అలాంటి త్యాగధానులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా పి గోపి, ఆర్ దుర్గాప్రసాద్, కె కవిత, రంగ శ్రీ ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు.