బందరు లడ్డుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు

మచిలీపట్నం:
నగరంలో ప్రసిద్ధిగాంచిన మల్లయ్య స్వీట్స్ సంస్థ తయారు చేసిన సాంప్రదాయ బందరు లడ్డుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఎటువంటి యంత్రాలు ఉపయోగించకుండా, పూర్తిగా చేతితో తయారు చేసిన బందరు లడ్డుతో పాటు ఇతర పిండి వంటల విశిష్టతను గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ, మల్లయ్య స్వీట్స్ సంస్థ 1959 సంవత్సరం నుంచి నేటి వరకు జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించిందని ప్రశంసించారు. ఈ సంస్థ అధినేత గౌర వెంకటేశ్వర్లు గారు సాంప్రదాయ పద్ధతుల్లో నాణ్యత, పరిశుభ్రతతో స్వీట్స్ తయారు చేస్తూ తరతరాలుగా వినియోగదారుల ఆదరణ పొందుతున్నారని తెలిపారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని, గౌర వెంకటేశ్వర్లు గారు 2025 కిలోల పిండి వంటలను—బందరు లడ్డుతో పాటు మరో ఐదు రకాల సంప్రదాయ పిండి వంటలను—తయారు చేయడం ఒక వినూతన ప్రయోగంగా భావించి, దీన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసినట్లు డా. వెంకటాచారి వెల్లడించారు.స్వీట్స్ తయారీలో పాటించిన పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు.
గౌర వెంకటేశ్వర్లు గారు గతంలో ప్రపంచ తెలుగు మహాసభలు, సంక్రాంతి సంబరాలు, అమరావతి ఆవకాయ కార్యక్రమం వంటి అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌర వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు కూడా తమ స్వీట్స్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్వీట్స్ రంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

