ప్రజలు ఎదుర్కునే సమస్యకు పరిష్కారం , చట్ట పరంగా న్యాయం అందించడానికి కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి మీ సమస్యలు చట్టపరిధిలో నిర్ణీత సమయంలోపల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి అందిన ఫిర్యాదులలో కొన్ని అవనిగడ్డ నుండి రాణి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 5 సంవత్సరాలు అయిందని, ఇద్దరు ఆడపిల్లలు కలిగారని అయితే అత్తింటివారు ఆడపిల్లల పుట్టారనే నెపంతో పుట్టింటికి పంపివేసి తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నారని, అంతేకాక నాకు బలవంతంగా విడాకులు ఇవ్వాలని చూడడమే కాక నా చదువుకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇతరత్రా విలువైన పత్రాలు నగలు అన్నింటిని వారివద్దే ఉంచుకొని నా పిల్లలకు అన్యాయం చేస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు. పెనమలూరు నుండి నాంచారయ్య అనే వృద్ధుడు వచ్చి తనకు ఇద్దరు మగ పిల్లలని, పెద్ద కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోయాడని, అతని భార్య అత్తమామలమనే కనికరం కూడా లేకుండా ఆస్తికాచెయ్యాలనే దురుద్దేశంతో మా ఆస్తిని కాజేయాలని చూస్తూ మనశాంతిగా బ్రతకనీయకుండా మానసికంగా, శారీరకంగా హింసిస్తుందని వారి బంధువులను తీసుకువచ్చి మాపై భౌతిక దాడికి పాల్పడుతుందని న్యాయం చేయమని ఫిర్యాదు. మచిలీపట్నం నుండి చందు అనే యువతీ వచ్చి తాను బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటుండగా వారి దగ్గర బంధువుల లో ఒకరు ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం ఉందని, దానికి కొంత డబ్బు చెల్లిస్తే ఉద్యోగం వస్తుందని నమ్మ పలికి దఫ దఫాలుగా మొత్తం 3 లక్షలు ఇవ్వడం జరిగిందని, డబ్బులు చెల్లించి చాలా కాలమైనప్పటికీ ఎటువంటి సమాచారం లేదని, అదేమని అడిగితే అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
గుడివాడ నుండి రామారావు అనే వ్యక్తి వచ్చి తన కుమార్తెను తన సొంత బంధువకే ఇచ్చి వివాహం జరిపించి వివాహ సమయంలో కట్న కానుకలన్నీ ఇవ్వడం జరిగిందని, అయితే వేరొక మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని తన కుమార్తెను కడుపున పుట్టిన బిడ్డను హింసిస్తున్నాడని అంతేకాక విడాకులు ఇచ్చి వేరొక వివాహం చేసుకోవాలని ఇంటి నుండి గెంటివేసాడని న్యాయం చేయమని ఫిర్యాదు.