మచిలీపట్నం :
జిల్లాలో మరో కొత్త రీచ్ లను గుర్తించి 24 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 5 ఇసుక రీచ్ లకు గాను నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంక 4 ఇసుక రీచ్ లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రజలు తీసుకునీ వెళ్లడానికి అందుబాటులో ఉన్నదన్నారు.
ఐదవ ఇసుక రీచ్ అయిన పాప వినాశనంలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నప్పటికీ అది ప్రస్తుతం టెండర్ల దశలో ఉందన్నారు.
కొత్తగా ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్ లను గుర్తించాలని, రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.
పోలీసు, రెవెన్యూ, గనుల శాఖ అధికారులు గట్టి నిఘా ఉంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు.
జిల్లాలో ఎక్కడా కూడా సొంత అవసరాలకు ఇసుకను త్రవ్వకుండా నిరోధించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, గనులు భూగర్భ శాఖ ఏడి శ్రీనివాస్ కుమార్, మచిలీపట్నం ఇన్చార్జి ఆర్డీవో పోతురాజు, భూగర్భ జల శాఖ ఇన్చార్జి ఏడి చిరంజీవి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, గనుల శాఖ ఏ.జి.కొండారెడ్డి, ఆన్లైన్లో గుడివాడ, ఉయ్యూరు ఆర్డిఓ లు బాలసుబ్రమణ్యం, షారోన్ తదితర అధికారులు పాల్గొన్నారు.