మచిలీపట్నం:
వైష్ణవ సంప్రదాయంలో, ధనుర్మాసం సమయంలో “కూడారై వెల్లుమ్”(27వ రోజు) పర్వదినం రోజున అక్కారవడిశల్ అనే ప్రత్యేక ప్రసాదమును స్వామికి నివేదన చేస్తారు.
ఈ ప్రసాదంలో బియ్యం, పప్పు కంటే పాలు, నెయ్యి, బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ప్రసాదంలో నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తారంటే, ప్రసాదాన్ని తింటున్నప్పుడు నెయ్యి మోచేతి వరకు కారాలి అని భక్తులు నమ్ముతారు. ప్రసాదం తింటున్నప్పుడు “ముళంగై వళివార నెయ్యి” (నెయ్యి మోచేతి వరకు కారాలి) అని తిరుప్పావైలో ఉంటుంది. దీని అర్థం భగవంతుని అనుగ్రహం మనపై అంత సమృద్ధిగా (ధారగా) ఉండాలని.
ఆండాళ్ అమ్మవారు ధనుర్మాసం అంతా కఠిన నియమాలతో వ్రతం చేస్తారు. 27వ రోజు (కూడారై వెల్లుమ్) ఆ వ్రతం ఫలించి, స్వామి అనుగ్రహం లభించినందుకు సంతోషంగా ఈ షడ్రుచుల విందును ఆరగిస్తారు. అందుకే భక్తులు కూడా ఈ రోజున ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
ఆండాళ్ అమ్మవారు రచించిన తిరుప్పావైలో 27వ పాశురం (పాట) “కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా…” అని మొదలవుతుంది. కూడారై” అంటే “భగవంతుడిని చేరని వారు” లేదా “వ్యతిరేకించేవారు” అని అర్థం. భగవంతుడు తన కల్యాణ గుణాలతో అటువంటి వారిని కూడా గెలుచుకుంటాడని (వెల్లుమ్) ఈ పాశురం అర్థం.
“కూడారై వెల్లుమ్” అంటే “మనతో కలవని వారిని కూడా మన మంచితనంతో గెలవడం” అని అర్థం.
ఆదివారం నాడు ఇంతటి ప్రశస్తమైన ” కూడారై” పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండీ కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, పెదముత్తీవి గ్రామంలోని శ్రీ కృష్ణాశ్రమమునకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.
ముముక్షుజన మహా పీఠాధిపతి శ్రీ ముత్తీవి గౌర కృష్ణ గురుదేవులు ఉదయం నుండి స్వయంగా 200 కిలోల “కూడారై” ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు..