మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం పేదల పాలిట గొడ్డలి పెట్టని మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ అన్నారు. ఏఐసీసీ పిలుపు పిసిసి ఆదేశాల మేరకు మచిలీపట్నంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ 2005 వ సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ ,యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ,వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ జాతీయ కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించారన్నారు. దీని సారాంశం వలసలను అరికట్టడం అందులో భాగంగా సంవత్సరానికి కనీసం వంద రోజులు తమతమ గ్రామాలలో పని కల్పించడం దళారులు లేకుండా సూటిగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతుంది. గ్రామస్తులు పని అడిగితే 15 రోజుల్లోపు పనిని కల్పించాలి లేకపోతే నిరుద్యోగ భృతిని కల్పించాలి. ఈ పథకం ఖర్చు కేంద్రమే భరించేలా ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టవశాత్తు మోడీ ప్రభుత్వం ఆ పథకం యొక్క పేరును మార్చి విబి జి రాంజీ అన్న పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చి నిరుపేదల నోట్లో మట్టి కొట్టింది అన్నారు. 70 శాతం కేంద్రం 30 శాతం రాష్ట్రం భరించాలి, ఇప్పటికే ఆర్థిక రోడ్డులో ఉన్న రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి పని అడిగిన 15 రోజుల్లోపు పని కల్పించాలి లేకపోతే నిరుద్యోగ భృతిని కల్పించాలి అనే అంశాన్ని తీసివేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రం దిగి వచ్చేవరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ కోకా ఫణి భూషణ్ ,చిలుకోటి ప్రసాద్, నల్లబోలు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.