జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు అంశాలపై కలెక్టర్లతో మాట్లాడారు. ప్రధానంగా, నియోజకవర్గాలలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు, 2025 సదస్సులో ఒప్పందం చేసుకున్న పరిశ్రమల స్థాపనకు చర్యలు, జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశాల నిర్వహణ, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సేవలపై సానుకూల ప్రజా దృక్పథం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాలలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటులో భాగంగా జిల్లాలోని ఆయా నియోజకవర్గాలలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి అందే సూచనల ఆధారంగా ముందుకెళ్తామని జిల్లా కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారి జి మోహన్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి హరిహరనాథ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీలక్ష్మీ, జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరులు, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా సమన్వయ అధికారి రవికాంత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.