వేసవిలో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…. కలెక్టర్ డీకే బాలాజీ
SSN
- January 8, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
జిల్లాలో వచ్చే వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ సంస్థలకు మంజూరైన పారిశుధ్య సముదాయాలను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్ లో గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న వేసవి ఎలాంటి మంచినీటి కొరత రాకుండా అన్ని సమ్మర్ స్టోరేజీ చెరువులను నింపుకోవడం జరిగిందని, ఏప్రిల్ మొదటి వారం వరకు వీటి ఎద్దడి లేకుండా గడపవచ్చన్నారు. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి మంచినీటి రవాణా కు బదులుగా ఆ ప్రాంతంలో బోర్లు వేయాలన్నారు. జిల్లాలో ఏలూరు కాలువ పరిధిలో ఎనికెపాడు వద్ద దిగువ సొరంగం మూసివేసే పరిస్థితి ఉండడంతో దాని పరిధిలోని గన్నవరం, గుడ్లవల్లేరు మండలాల పరిధిలో ఉన్న మొత్తం 31 సమ్మర్ స్టోరేజీ చెరువులను ముందుగానే నింపుకోవడం జరిగిందన్నారు. పలు సచివాలయాల్లో సంక్షేమ వసతి గృహాలు గురుకులాల్లో సామూహిక పారిశుద్ధ్య ప్రాంగణాలు 697 మంజూరు కాగా 168 పూర్తయ్యాయని 210 పురోగతిలో ఉన్నాయన్నారు. అందులో 226 పనులు రద్దు చేయగా ఇంకా 93 పనులు అసలు మొదలు కాలేదన్నారు. ప్రభుత్వ సంస్థల పరిధిలోనీ మరుగుదొడ్ల నిర్మాణం ఆలస్యం చేయడం సరైనది కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లులను నిధి పోర్టల్ లో వెంటనే అప్లోడ్ చేసి చెల్లింపులు జరపాలన్నారు
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా 650 మరుగుదొడ్లు మంజూరు చేయగా ఇప్పటికీ 98 మరుగుదొడ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు అన్ని సత్వరమే నిర్మించుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 477 గ్రామాలు ఉండగా అందులో ఇప్పటికే 459 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ఆదర్శ గ్రామాలుగా ప్రకటించడం జరిగిందని, మిగిలిన 8 గ్రామాలను కూడా ఆ విధంగా ప్రకటించేందుకు అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు, మంచినీటి వసతి ఏర్పాట్ల కోసం మంజూరైన 61 పనులలో 3 పనులు పూర్తయ్యాయని, 36 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని మరో 22 పనులు ఇంకను మొదలు కాలేదన్నారు.పురోగతిలో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు ఇంకా ప్రారంభం కానీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఎంపీ లాడ్స్ కింద 18 పనులు మంజూరు కాగా అందులో ఇప్పటికీ 12 పనులు పూర్తయ్యాయని మిగిలిన 6 పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 8.60 కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో 53 పనులు మంజూరు కాగా అందులో 41 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. . వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జల జీవన్ మిషన్ కింద 455 పనులకు గాను ఇప్పటివరకు 409 పనులు పూర్తయ్యాయని మరో 32 పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయన్నారు వాటిని కూడా సత్వరమే పూర్తి చేయుటకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్ డిఈఈ లు సుధాకర్, సత్యనారాయణ, ప్రసన్న, నారాయణరావు ఎస్ ఈ కార్యాలయం ఇంజనీర్ రత్న రావు పలువురు ఏఈలు పాల్గొన్నారు.

