జాతీయ సేవా శిబిరాలలో పాల్గొనే విద్యార్ధులు తమ భవిష్యత్ కు మంచి బాటలు వేసుకుంటారని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు అన్నారు. గురువారం కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ – 1 ఆధ్వర్యములో బందరు కోట లో నిర్వహిస్తున్న సేవా శిబిరం ముగింపు కార్యక్రమం లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నాలుగు గోడల మధ్య చదువుకోవటం ఒకెత్తయితే జాతీయ సేవా శిబిరాలలో పాల్గొని నేర్చుకోవడం జీవితానికి పాఠం లాంటిదన్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు శిబిరం లో పాల్గొన్న వాలంటీర్లను అభినందించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం లో ఇతర ఎన్ ఎస్ ఎస్ విభాగాలు మరింత ఉత్సాహం తో పనిచేయాలన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా సల్మా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భముగా ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు మున్సిపల్ ఉన్నత పాఠశాల కు ప్లాస్టిక్ కుర్చీలు బహుకరించారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రోగ్రామ్ అధికారిణి డా. సల్మా ను సత్కరించారు.