వ్యక్తిత్వం లేని వారు ఎంత ఉన్నత చదువులు చదివినా వ్యర్ధమేనని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యములో జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా గురువారం డ్రగ్స్, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల కు బానిస అయిన వారు తమ మీద పట్టు కోల్పోతారని, చివరకు వాటిని తీసుకునేందుకు ఎలాంటి అఘాయిత్యానికైన తెగబడతారన్నారు. ఇటువంటి విషయాల్లో భాగస్వాములైతే చట్ట పరిధిలో శిక్షార్హులేనన్నారు. డీఎస్పీ చిట్టిబాబు మాట్లాడుతూ జీవితం లో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన సంఘటనలు నుండి బయటపడి ఉన్నతోద్యోగం సాధించిన తీరును వివరించారు. ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ యువత దేశానికి గొప్ప ఆస్తి అన్నారు. చైనా అనూహ్య రీతిలో అభివృద్ధి చెందడం లో అక్కడ యువతే కీలక పాత్ర పోషించారన్నారు.
ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, సీనియర్ న్యాయవాది ముసలయ్య తదితరులు ప్రసంగించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. శేషా రెడ్డి, డా. శాంతి కృపా, డా. రవి, డా. గోపి, విద్యార్ధులు పాల్గొన్నారు.