కృష్ణా విశ్వవిద్యాలయం: దేశంలో ఎవరైనా రాజ్యాంగానికి బద్దలై పనిచేయాల్సిందేనని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ – 1 ఆధ్వర్యములో బందరు కోట లో నిర్వహిస్తున్న సేవా శిబిరం ఆరో రోజుకు చేరింది. బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సును ఉపకులపతి ఆచార్య కె రాంజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం సంక్రమంగా నడవడానికి రాజ్యాంగంలో నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది అని ఎవరైనా వాటి పరిధిలో పనిచేయాల్సిందే అన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య మాట్లాడుతూ చదువు ద్వారానే ప్రశ్నించే తత్వం అలవర్చుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉన్నప్పుడే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయన్నారు. పౌర హక్కులు తెలుసుకోవడం ఎంత అవసరమో విధులు నిర్వర్తించడం కూడా అంతే అవసరమన్నారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా సల్మా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అజ్మతున్నిసా, గ్రామస్థులు, విద్యార్ధులు పాల్గొన్నారు.