జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బందరు డిఎస్పి సిహెచ్ రాజా రోడ్డు భద్రతా మాసోత్సవాలు ( శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన కార్యక్రమం) సందర్భంగా బందరు కోనేరు సెంటర్లో ప్రజలకు, వాహన దారులకు సోమవారం అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ,రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.ట్రాఫిక్ రూల్స్ పాటించి, తక్కువ వేగంతో వాహనాలలో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తగు సూచనలు చేశారు. నూతనంగా అమలులోకి వచ్చిన మోటార్ వాహన చట్టం ద్వారా జరిమానాలు భారీగా పెరిగాయని గుర్తు చేస్తూ, వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ట్రాఫిక్ చిహ్నాలను గుర్తుంచుకొని దానికి తగిన విధంగా వాహనాలను నడపాలని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ప్రజా రవాణా వాహన చోదకులు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలనీ అన్నారు. రాష్ట్రంలో ఇతర పట్టణాల కన్నా మచిలీపట్నం రోడ్లు విశాలంగా ఉంటాయని కానీ చిరు వ్యాపారస్తుల ఆక్రమణలు, అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ నున్న రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.