మీకోసం కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులపై చట్టపరిధిలో పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ నలుమూలల నుండి వచ్చిన ప్రజల సమస్యలను సానుకూలంగా విని పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. మీకోసం కార్యక్రమం ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, చట్టపరిధిలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి పరిష్కారం అందిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వివిధ రకాల సమస్యలతో మొత్తం 30 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో జిల్లా ఎస్పీ కి సమర్పించారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు బదిలీ చేసి, పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సోమవారం మీకోసం కార్యక్రమంలో అందిన ఫిర్యాదుల వివరాలు.
పెనమలూరు నుండి సావిత్రి అనే మహిళా వచ్చి తనకు వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుందని తన వివాహ జీవితంలో ఒక కుమారుడు, కుమార్తె కలగగా తను అత్తింటి వారు అదనపు కట్నం కోసం తన భర్తకు మరొక వివాహం చేయాలని చూస్తున్నాడని తన భర్త దుర్వ్యసనాలకు బానిసై భౌతిక దాడికి పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
బంటుమిల్లి నుండి ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ భూమికి సరిహద్దుదారుడు తన పొలంలోకి వెళ్ళనివ్వకుండా ఆటంకం కలిగిస్తున్నాడని అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.
అవనిగడ్డ నుండి నరసయ్య అనే వ్యక్తి వచ్చి తన వ్యవసాయ అవసరాల నిమిత్తం దగ్గర బంధువుల వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకున్నానని క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ అధిక వడ్డీ పేరుతో ఎక్కువ మొత్తం కట్టాలని వేధిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.