మచిలీపట్నం :
జిల్లాలో కోడిపందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఎక్కడైనా జరిగితే కఠినంగా వ్యవహరించి కేసులు బనాయించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు బర్డ్స్ అనిమల్స్ (ఎస్ పి సి ఏ ) సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కోడిపందాల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఇప్పటినుండి చాలా కఠినంగా వ్యవహరించాలని తర్వాత సమస్య తీవ్రతరం అవుతుందన్నారు.
డివిజను, మండల, గ్రామస్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
ఎక్కడైనా గ్రామాల్లో కోడిపందాలు నిర్వహిస్తుంటే వెంటనే మండల స్థాయి కమిటీకి తెలియజేయాలన్నారు.
డివిజన్, మండల, గ్రామస్థాయిలలో కమిటీల సమావేశాలు నిర్వహించి కోడిపందాల చట్టరీత్యా నేరం అనే విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇదివరకు కోడిపందాలు నిర్వహించే వారిని గుర్తించి బైండ్ ఓవర్ కూడా చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు,జెడ్పిసిఈఓ కే కన్నమ నాయుడు, డిఎఫ్ఓ సునీత, డిఇఓ సుబ్బారావు, డిఎస్పి సిహెచ్ రాజా, ఆర్టిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు వాణిజ్య పన్నుల శాఖ ఏఈఓ ప్రసాదు, డిపిఓ కార్యాలయ ఏవో సీతారామయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.