మచిలీపట్నం :
మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ లో ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు మచిలీపట్నంలోని డాక్టర్ల కుటుంబాలన్నీ కలిసి సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా సర్వజన ఆసుపత్రి సూపర్డెంట్ డా. ఆశాలత పాల్గొన్నారు. దీనిలో భాగంగా మొదట భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించారు. వేద పండితుల ఆశీర్వచనంతో పిల్లలకు భోగి పళ్ళు పోసి హారతులు ఇచ్చారు.
అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మైల ద్రువీక కూచిపూడి నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. సినిమా పాటలకు బాలబాలికలు నృత్య ప్రదర్శన, బాల బాలికలచే పాటల కచేరి, సంగీత వాద్య ప్రదర్శన మొదలైన కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నంలోని ప్రముఖ వైద్యుల కుటుంబాలు, పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ కలిసి సందడి చేశారు.