సామాజిక సంస్కర్త సావిత్రీబాయి ఫూలే
SSN
- January 3, 2026
- 1 min read
[addtoany]
సావిత్రీబాయి ఫూలే (జనవరి 3, 1831 – మార్చి 10, 1897) భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక సంస్కర్త. ఆమె చేసిన కృషి ఆధునిక భారతీయ విద్యారంగంలో, ముఖ్యంగా మహిళా సాధికారతలో ఎంతో కీలకమైనది.
జనవరి 3, 1831న జన్మించిన సావిత్రీబాయి ఫూలే తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలేతో కలిసి సమాజంలో మార్పు కోసం, ముఖ్యంగా మహిళలు మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పలు సంస్థలను స్థాపించారు.
బాలికల పాఠశాల (1848)
పుణేలోని భిడే వాడలో భారతదేశపు మొట్టమొదటి బాలికల పాఠశాలను వీరు ప్రారంభించారు. కేవలం 9 మంది విద్యార్థులతో మొదలైన ఈ ప్రయాణం, అప్పట్లో స్త్రీ విద్యపై ఉన్న అపోహలను పటాపంచలు చేసింది.
సావిత్రీబాయి పాఠశాలకు వెళ్లేటప్పుడు, మార్గమధ్యంలో కొందరు ఛాందసవాదులు ఆమెపై బురద, పేడ విసిరేవారు. అయినా ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా, తనతో పాటు ఒక అదనపు చీరను వెంట తీసుకెళ్లి, పాఠశాలకు వెళ్ళాక మార్చుకుని పిల్లలకు పాఠాలు చెప్పేవారు.
సత్యశోధక్ సమాజ్ (1873)
సెప్టెంబర్ 24, 1873న ఈ సంస్థను స్థాపించారు.
అంటరానితనం నిర్మూలన, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడటం మరియు అణగారిన వర్గాలకు (దళితులు, వెనుకబడిన తరగతులు) విద్యా అవకాశాలు కల్పించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. జ్యోతిరావు ఫూలే మరణానంతరం సావిత్రీబాయి ఈ సంస్థకు అధ్యక్షత వహించి సమర్థవంతంగా నడిపించారు.
మహిళా సేవా మండల్ (1852)
మహిళల హక్కుల కోసం అవగాహన కల్పించడానికి ఈ సంస్థను స్థాపించారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడం, వారికి సామాజిక భద్రత కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. కుల మతాలకు అతీతంగా మహిళలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేసింది.
బాలహత్య ప్రతిబంధక్ గృహ (1863)
గర్భవతులైన వితంతువులకు రక్షణ కల్పించడానికి మరియు వారి పిల్లలను కాపాడటానికి ఈ కేంద్రాన్ని తమ స్వంత ఇంట్లోనే ఏర్పాటు చేశారు.
సమాజం నుండి ఎదురయ్యే అవమానాల వల్ల వితంతువులు ఆత్మహత్యలకు పాల్పడకుండా లేదా శిశువులను చంపకుండా ఈ సంస్థ ఆశ్రయం ఇచ్చేది.
ఇక్కడే జన్మించిన యశ్వంత్ అనే బాబును వారు దత్తత తీసుకుని, డాక్టర్‌గా చదివించారు.
స్వదేశీ వస్తు ప్రచారిణి సభ
విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ప్రజల్లో చైతన్యం నింపడానికి ఈ సంస్థ ద్వారా పనిచేశారు.
సావిత్రీబాయి గొప్ప రచయిత్రిగా కూడా పేరు గాంచారు. ఆమె రాసిన ‘కావ్య ఫూలే’ (Kavya Phule) మరియు ‘బావన్ కాశీ సుబోధ్ రత్నాకర్’ ప్రసిద్ధ రచనలు.
1897లో పూణేలో ప్లేగు వ్యాధి సోకిన వారి కోసం ఆమె మరియు ఆమె కుమారుడు యశ్వంత్ కలిసి ఒక ప్రత్యేక క్లినిక్ (హాస్పిటల్)ను కూడా ఏర్పాటు చేశారు. రోగులకు సేవ చేస్తున్న క్రమంలోనే ఆమె కూడా వ్యాధి బారిన పడి ప్రాణాలు వదిలారు.
“చదువుకోకపోతే అన్నీ కోల్పోతాం, జ్ఞానం లేని జీవితం పశువుల కంటే హీనం” అని సావిత్రీబాయి ఫూలే అనేవారు.
శ్యామ్ కాగిత
మచిలీపట్నం.
మచిలీపట్నం.

