మచిలీపట్నం :
2026 నూతన సంవత్సరం సందర్భంగా గురువారం తెల్లవారుజామున నగరంలోని పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గత కాలమంతా నీ రెక్కల కాపుదలలో మమ్మల్ని కాపాడావని.. ఈ నూతన యేడాది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాచి కాపాడాలని క్రైస్తవులు యేసుక్రీస్తును ప్రార్ధించి వేడుకున్నారు.
నగరంలోని పలు చర్చలకు వైఎస్సార్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కృష్ణమూర్తి (కిట్టు) తదితర నాయకులు వెళ్లి క్రైౖ స్తవులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని రైలుపేటలో ఉన్న బేతేలు మినిస్ట్రీస్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న పేర్ని కిట్టు పాస్టర్ నేరెళ్ల వాల్టర్స్ ప్రేమ్ కుమార్ తో కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేశారు.
అలాగే మల్కాపట్టణంలోని ఎల్ఈఎఫ్, బైపాస్ రోడ్లోని జిజిఎం, మాచవరంలోని పెంతుకోస్తు, శారదనగర్లోని ఆర్ సి ఎం, ఈడేపల్లిలోని ది పెంతుకోస్తు చర్చిల్లో జరిగిన నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనల్లో పేర్ని కిట్టు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ మన ప్రాంతంలో వరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వారి ఇబ్బందులు తొలగిపోవాలని ప్రార్థనలు చేయాలని క్రై స్తవులను కోరారు. వరి సాగు చేసే సమయంలో వర్షాలు, తుఫానులతో ఇబ్బందిపడి పంటను రక్షించుకున్నా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని, గిట్టుబాటు ధర ఇచ్చేందుకు పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించాలని కోరారు.
ఈ పర్యటనలో పేర్ని కిట్టు వెంట వైఎస్సార్సిపి జిల్లా కోశాధికారి బందెల థామస్ నోబుల్, ఆ పార్టీ నగర ఉపాధ్యక్షుడు గూడవల్లి నాగరాజు, కోఆప్షన్ సభ్యుడు బేతపూడి రవి, పార్టీ నగర నాయకుడు బూరగ రామారావు తదితరులు ఉన్నారు.