మచిలీపట్నం:
అధిక ఆదాయం తెచ్చిపెట్టే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులతో (వీఏఏ) ప్రకృతి వ్యవసాయ సాగుపై మాట్లాడి జిల్లాలోని రైతులను ఆ దిశగా ప్రోత్సహించడంపై వారికి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీ రూపంలో విత్తనాలు, రసాయనిక ఎరువులు సరఫరా చేయడంతో పాటు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ స్వల్ప ఆదాయాన్ని పొందుతున్నారన్నారు. పెట్టుబడి వ్యయం పెరిగిపోయి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని, వారిని మంచి లాభాలు పొందే దిశగా నడిపించేందుకు ప్రకృతి వ్యవసాయం సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. దీనికోసం రైతు సేవ కేంద్రాల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల తాను గూడూరు మండలం పినగూడూరులంక గ్రామంలో సౌభాగ్య ఆహార అడవి నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అభ్యుదయ రైతు విజయరామ్ సాగు చేస్తున్న పంటలను పరిశీలించిన సందర్భాన్ని వివరిస్తూ, ఆసక్తి గల రైతులు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసక్తి గల రైతులకు సాగుపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అలాంటి వారిని గుర్తించాలని సూచించారు. రసాయనిక ఎరువులతో పండించే పంటలతో మానవుల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలను వివరించాలని, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పరిస్థితులను తట్టుకొని నిలబడే ప్రకృతి వ్యవసాయ పంటల సాగులో వ్యత్యాసాన్ని రైతులకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు.
ఈ క్రమంలో అభ్యుదయ రైతు విజయరామ్ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను, సాగు అనుభవాలను అధికారులు, వీఏఏలతో పంచుకున్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాలని, సాగు పట్ల ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తానని ఆయన తెలిపారు.
కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎన్ పద్మావతి, జె జ్యోతి, ఏపీ ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, ఏడి మణిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.