మచిలీపట్నం:
మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
హుస్సేన్ పాలెం నుంచి బొర్రపోతుపాలెం గ్రామం మీదుగా గొల్లగూడెం గ్రామం వరకు రూ.1.8 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించనున్న రహదారి అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ఛైర్మన్ బండి రామకృష్ణ, తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నిధులు సమకూర్చి సహకారాన్ని అందిస్తున్నారని, వారి సహకారంతో గ్రామంలో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తికానున్నదని, దీని ద్వారా పెద్ద ఎత్తున అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మచిలీపట్నం పోర్టు కనెక్టివిటీ రహదారులు చేపడుతున్నామని, వాటిని ఇంతేరు గ్రామం వరకు విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల మంగినపూడి బీచ్ తోపాటు తీర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సాస్కీ కింద నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దాదాపు రూ.20 కోట్లు మంజూరు చేశారని అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి లబ్ధి చేకూర్చామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి కొల్లు రవీంద్ర ఎంతో శ్రమిస్తూ నిధులను తెస్తున్నారని అభినందించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు వన్నెం సునీల్, కుంభం రామస్వామి, యలకుర్తి విష్ణు, సాయిరాం, మాదివాడ రాము, గడ్డం రాజు, మధుసూదన్ రావు, సోమశేఖర్, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.