పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు – జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
SSN
- December 30, 2025
- 0 min read
[addtoany]
కానూరు:
పరిశ్రమల ఏర్పాటు కోసం భూ కేటాయింపులు జరిగి అనుమతులు మంజూరు చేసిన యూనిట్ల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు 100 అడుగుల రోడ్డులోని అన్నే వారి కళ్యాణ మండపంలో జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, అధికారులను ఒక వేదిక వద్దకు చేర్చి పారిశ్రామికవాడల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. పారిశ్రామికవేత్తలు చెప్పిన సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి, పరిష్కరించగలిగిన వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, పరిధిలో లేనివి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పారిశ్రామికవాడలలో మౌలిక వసతులు కల్పించి పలు ప్రభుత్వ రాయితీలను అందించి ప్రోత్సహిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యలను రాతపూర్వకంగా తెలియజేయాలని, తద్వారా వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తామన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి 20 మంది వ్యాపారవేత్తలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని, వారిచ్చే నివేదిక ఆధారంగా తరచుగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
మల్లవల్లి, వీరప్పనేనిగూడెంలో పారిశ్రామికవాడల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పలు పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచిస్తూ, వాటి నిర్వహణ బాధ్యతలను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సిబ్బందికి నివాస భవనాలు (క్వార్టర్స్) నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరగా, సమీపంలో ప్రభుత్వ భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. సేల్ డీడ్ అగ్రిమెంట్ పత్రాలు ఉన్నప్పటికీ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులను సమీపిస్తే రుణాలు మంజూరు చేయడంలేదని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సూచించారు.
సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు, మల్లవల్లి పారిశ్రామికవాడ చైర్మన్ జి రవికుమార్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

