జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ రెవిన్యూ క్లినిక్లను ప్రారంభించి, పనితీరు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లో 5 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అందులో దరఖాస్తుల పరిశీలన, సలహా సూచనల విభాగము, 22-ఏ సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, సుమోటో అడంగల్ కరెక్షన్ సంబంధిత సమస్యలు, రీ సర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ (ఎల్పిఎం) సంబంధిత సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యల విభాగాలున్నాయి.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 18 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు విషయమై ప్రస్తావించి ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి మంచి విధానాలను అన్ని జిల్లాల్లో చేపట్టాలని ఆదేశించారన్నారు.
ఇందులో భాగంగానే జిల్లాల్లో కూడా రెవెన్యూ క్లినిక్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో ఎక్కువగా భూసంబంధ సమస్యలు ఉంటున్నాయని వాటన్నిటికీ రెవిన్యూ క్లినిక్ ద్వారా చక్కటి పరిష్కారం లభించనుందన్నారు.
ప్రజలందరూ రెవిన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకొని వారి భూ సంబంధ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.