మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మచిలీపట్నం నగరంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివరాత్రి పండుగ సందర్భంగా నాగులేరు వాగు వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు అభిషేకాలతో శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మచిలీపట్నం కాలే ఖాన్ పేటలోని మంచినీటి కాలువ గా పిలువబడుతున్న నాగులేరు వాగు కు భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. భక్తుల తో నాగులేరు వాగు రద్దీగా మారింది. పండుగ సందర్భంగా ఉదయం నుండి నాగులేరు వాగులో భక్తులు పుణ్యా స్నానంను ఆచరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. శివాలయము భక్తులతో కిక్కిరిసింది.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. వృద్ధులకు మహిళలకు హిందూ స్నాన ఘట్టాలను కూడా ఏర్పాటు చేశారు. మునిసిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ నాగులేరు వాగు పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచారు.
అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లను నియమించి భక్తులకు మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేసి అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. పూజారులు, జంగమ దేవర్లు, భక్తుల పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు దారి పొడవునా పలువురు దాతలు మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు.
భక్తులు పితృదేవతలకు తర్పణాలు అనంతరం దానధర్మాలు చేశారు. మహాశివరాత్రి రోజున దానమిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. మచిలీపట్నం బస్టాండ్ వద్ద నుండి దక్షిణ కాశీగా పేరుపొందిన పెద్ద కళ్లెపల్లికి బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులతో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఏపీఎస్ఆర్టీసీ మచిలీపట్నం డిపో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించారు. మచిలీపట్నం నుండి భక్తులు పెదకళ్లెపల్లికి శివుని దర్శించుకుని పూజలు చేశారు.