మచిలీపట్నం:
దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడు వడ్డే ఓబన్న అని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు.
ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో పోరాటయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించి సభా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటిసారి సిపాయిల తిరుగుబాటు జరిగిందని అందరికీ తెలుసన్నారు. అయితే అంతకుమునుపే చరిత్ర గుర్తించని వారు ఎంతో మంది దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారిలో వడ్డే ఓబన్న ఒకరన్నారు.
బ్రిటిష్ ప్రభుత్వంలో వడ్డే ఓవన్న గ్రామ రక్షకునిగా ఉద్యోగం చేస్తూ ఆ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని సహించలేక పోరాటానికి దిగారన్నారు.
రైతులకు విధించిన పన్నులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సంఘటితపరిచి, ఉత్సాహపరిచి బ్రిటిష్ వారినీ ఎదుర్కోవడానికి ముందుకు తీసుకెళ్లడం గొప్ప విషయం అన్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ఆనాడు బ్రిటిష్ వారి వద్ద ఎన్నో రకరకాల ఆయుధాలు ఉండేవని అటువంటి వారితో పోరాటం చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు.
1846లో కోయిలకుంటలో ఒక ఆంధ్రా రాబిన్ హుడ్ లాగా తహసిల్దార్ కార్యాలయము, ఖజానా కార్యాలయాన్ని ముట్టడించి ఆ నిధులను అవసరం ఉన్న పేదవారికి పంచి పెట్టారన్నారు.
ఆయన జీవితం గురించి రాసిన ఒక పుస్తకం కర్నూల్లో ఉన్నట్టు తెలిసిందని దాని ప్రతిని ఒకదానిని తెప్పించి ఇక్కడి గ్రంధాలయంలో పెడదామని ఆయన గురించి ఎక్కువమంది తెలుసుకునే వీలు కల్పిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి. రమేష్, డి టి డబ్ల్యూ ఫణి ధూర్జటి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జిల్లా రైతు నాయకులు గోపు సత్యనారాయణ, వివిధ బీసీ సంఘాల నాయకులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.