కృష్ణా జిల్లాలో గుర్రపు డెక్కతో హ్యాండ్లూమ్స్
SSN
- January 10, 2026
- 1 min read
[addtoany]
చెరువుల్లో, కాలువలలో విపరీతంగా గుర్రపు డెక్క (Water Hyacinth) మొక్క పెరుగుతుంది అనీ, ఇది పనికిరాని మొక్క అనీ భావిస్తారు. కానీ దీని కాడలతో అద్భుతమైన కళాకృతులను, గృహోపకరణాలను తయారు చేయవచ్చు అని మీకు తెలుసా? ఇది పర్యావరణ హితమైనది (Eco-friendly) కూడా!
దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదీ తీరం దీని జన్మ స్థానం. మన దేశానికి ఇది బ్రిటీష్ వారి కాలంలో ఒక అలంకార మొక్కగా తీసుకురాబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కలలో ఒకటి. కేవలం రెండు వారాల్లోనే ఇది రెట్టింపు విస్తీర్ణానికి వ్యాపిస్తుంది. దీని కాడలు గాలితో నిండి ఉబ్బి ఉండటం వల్ల ఇది నీటిపై తేలుతూ, గాలికి లేదా నీటి ప్రవాహానికి ఒక చోటు నుండి మరొక చోటుకి సులభంగా వ్యాపిస్తుంది.

ఇక విషయానికి వస్తే, గుర్రపు డెక్కని చెత్త అని తీసి పార వేయకుండా, దీని కాడలతో పలు రకాల గృహోపకరణాలు (Home Decor) తయారు చేయవచ్చు. బుట్టలు (Baskets), మ్యాట్లు (Mats), గోడ అలంకరణలు (Wall Hangings), ఫ్యాషన్ వస్తువులు (Fashion Accessories), చేతి బ్యాగులు (Handbags), చెప్పులు (Footwear), టోపీలు (Hats), స్టేషనరీ (Handmade Paper), పూలకుండీలు(Planters) వంటివి గుర్రపు డెక్కతో చేయగలిగే కొన్ని ముఖ్యమైన కళాకృతులు.
తయారీ విధానం
చెరువుల నుండి గుర్రపు డెక్క మొక్కలను సేకరించాలి. ఆకులు, కాడలను వేరు చేసి, ఎండలో బాగా ఎండబెట్టాలి. అప్పుడు అవి బంగారు రంగులోకి మారి గట్టిగా తయారవుతాయి. ఎండిన కాడలను తేమ చేసి, వాటిని మెలితిప్పి నారలా మార్చుకోవాలి. ఈ నారతో కావాల్సిన వస్తువులను అల్లుకోవాలి. చివరగా మెరుపు కోసం మరియు ఎక్కువ కాలం మన్నడానికి వార్నిష్ పూయవచ్చు.
గుర్రపు డెక్కను “వేస్ట్” అని పారేయకుండా, ఇలాంటి కళాకృతులు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు, గ్రామీణ ఉపాధిని పెంపొందించవచ్చు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చొరవ
కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గుర్రపు డెక్క కాడలతో హ్యాండ్లూమ్స్ తయారీ ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ గమనించారు. ఆయన పట్టుదల వల్ల అస్సాం, మేఘాలయకు మాత్రమే పరిమితమైన కళాకృతులకు, పర్యావరణ హిత సంపదకు.. ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామం లో బీజం పడింది.
కృష్ణా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డిఆర్డిఏ) ఆధ్వర్యంలో చిన్నాపురం గ్రామంలో మొదటి విడతగా 30 మంది మహిళలను ఎంపిక చేసి లేపాక్షి సౌజన్యంతో గుర్రపు డెక్క కాడలతో హ్యాండ్లూమ్స్ తయారీపై నాలుగు నెలల పాటు శిక్షణ ఇప్పించారు. రెండవ విడతలో మరో 30 మంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. రెండు గ్రూపులకూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(NID) నెల రోజుల పాటు గుర్రపు డెక్క తో హస్తకళలు చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
ప్రభుత్వం శిక్షణ పూర్తి చేసిన సభ్యులను హయలూమ్ సొసైటీ గా రిజిస్టర్ చేసింది. దాంతో సొసైటీ లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ కోఆర్డినేషన్ తో లేపాక్షి సంస్థకు పది లక్షల విలువైన పలు ఉపకరణాల ఆర్డర్ పొందింది. అంతే కాకుండా కలెక్టర్ కార్యాలయం యాభై వేల రూపాయల విలువైన ఆర్డర్ ఇచ్చి ప్రోత్సహించింది.
కాలువ నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారిన గుర్రపు డెక్క నివారణకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో ఖర్చు పెడుతుంది. అదే కలుపు మొక్క గుర్రపు డెక్కతో గ్రామీణ మహిళలను కలిపి స్వయం ఉపాధి కల్పించి, వ్యాపారవేత్తలుగా ముందుకు నడిపిస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి శుభాభినందనలు.
శ్యామ్ కాగిత,
మచిలీపట్నం

