మచిలీపట్నం :
ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ పగడ్బందీగా చేపట్టి పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావుతో కలిసి ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణపై (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బూత్ స్థాయి అధికారులు తదితర ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2025 ఓటర్ల జాబితాలోని ఓటర్లతో మ్యాపింగ్ చేయాలని, అదేవిధంగా 2025 ఓటర్ల జాబితాలోని ఓటర్లను 2002 సంవత్సరంలో ఉన్న ఓటర్లతో వెరిఫై చేసి సంతాన (ప్రాజెనీ) మ్యాపింగ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాలని అధికారులకు సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక ఓటరు, ఒక నియోజకవర్గంలో మాత్రమే ఓటు కలిగి ఉండేలా చూడాలన్నారు. వ్యక్తి మరణించినా, ఇతర ప్రాంతాలకు వలసపోయినా, ఓటర్ల వివరాలను పరిశీలించి వారి ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించే విధంగా బిఎల్వోలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్ బూత్ కు బిఎల్ఏ ను తప్పనిసరిగా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ నిర్వహించే సమయంలో ప్రతి బిఎల్వో ఎన్యుమరేషన్ ఫారంను ప్రతి ఓటర్కు తప్పనిసరిగా అందజేయాలని, అదేవిధంగా నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ నిర్వహించు సమయంలో మొదటి అప్పీల్ అధికారిగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్, రెండవ అప్పీల్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారని కలెక్టర్ తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు పోతురాజు(ఇంచార్జ్), జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, పలు జిల్లా అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.