– ఎస్వీ హై స్కూల్ లో సంక్రాంతి శోభ
– ఆనందోత్సాహాలతో సంక్రాంతి వేడుకలు
– సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసిన విద్యార్థులు
– వేడుకల్లో పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ
మచిలీపట్నం :
భోగి మంటలు.. గొబ్బెమ్మలు.. పాల పొంగళ్ళు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. విద్యార్థులు వేసిన రంగురంగుల సంక్రాంతి ముగ్గులు.. బొమ్మల కొలువు.. కోలాట భజనలు.. పతంగుల అలంకారం.. ఫుడ్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలతో నగరంలోని జవ్వారుపేటలోని శ్రీ వేంకటేశ్వర హైస్కూల్ శుక్రవారం సందడిగా మారింది.
శనివారం నుంచి స్కూల్‌కు సంక్రాంతి సెలవులు కావడంతో స్కూల్ యాజమాన్యం శుక్రవారమే సంక్రాంతి వేడుకలను స్కూల్ ఆవరణలో అత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొనగా మరి కొంత మంది విద్యార్థులు శ్రీకృష్ణుడు– గోపిక, హరిదాసుల వేషధారణలో అలరించారు.
ఈ ఉత్సవాలకు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, హిందూ విద్యాసంస్థల చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, విద్యాసంస్థల డైరెక్టర్ అన్నపూర్ణ, మహిళా కళాశాల ప్రిన్సిపల్ భారతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొనకళ్ళ చిన్నారులకు భోగి పళ్ళు పోసి, పాల పొంగళ్లు, గంగిరెద్దుల విన్యాసాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరులు కురిపించే సంక్రాంతి పర్వదినాన్ని తెలుగు వారు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. సిరిసంపదలకు, భోగభాగ్యాలకు ఈ పండగ అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్సిపల్ ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.