సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా చేయండి…..జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
SSN
- January 3, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
జనవరి 5 వ తేదీ నుండి 11వ తేదీ వరకు నగరంలోని చింతగుంటపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం శాఖ చింతగుంటపాలెం దివ్య యోగ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ, చికిత్స శిబిరం పై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా సాధన తో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చన్నారు.
అవయవాలు ఉన్నంతవరకు యోగాసనాలు వేయాలని, ప్రాణాలు ఉన్నంతవరకు ప్రాణాయామం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకునేందుకు మానసికంగా ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. యోగ సాధన తో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు ఉత్తర భారత్ నుండి విచ్చేయుచున్న యోగా నిష్ణాతులు, నిపుణులచే నిర్వహించ బడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
అనంతరం ఏపీ యోగసభ మచిలీపట్నం శాఖ ప్రధాన కార్యదర్శి, యోగా గురువులు మాట్లాడుతూ యోగా గురువులు శ్రీ ములకరాజ్ జి మహారాజు వారి 127 వ జయంతి మహోత్సవములు పురస్కరించుకొని ఉత్తరాది నుండి వస్తున్న కార్యనిర్వాహక యోగాచారిణి దమయంతిజీ వారి సమక్షంలో ఈనెల 5 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉచిత యోగా శిక్షణ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. నిగూఢమైన అతి రహస్యమైన యోగా శాస్త్రమును బోధించి యోగ ప్రక్రియలను నేర్పించి లోక కళ్యాణార్థం ఆవిర్భవించిన మహాప్రభువు శ్రీరామలాల్ జి పరమ కృపకు పాత్రులైన వారు శ్రీ ములక్ రాజు జి మహారాజ్ వారన్నారు. శ్రీ ములకరాజ్ జీ వారు శ్రీరాంలాల్ ప్రభుజి వారి యోగ పరంపరలో యావత్ భక్తులందరికీ శిక్షణ ఇచ్చి తద్వారా శారీరక రుగ్మతలను పోగొట్టి మంచి ధ్యానస్థితిని ప్రసాదించినారన్నారు.
ఈ ఉచిత యోగా శిక్షణ శిబిరంలో 5 వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉదయం ఐదున్నర నుండి 8 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. మందులు లేకుండా యోగ చికిత్స ద్వారా రక్తపోటు, మధుమేహం, సయాటికా నొప్పులు, కీళ్ల నొప్పులు ఆస్తమా నరముల బలహీనత, అధిక బరువు తదితర అనేక వ్యాధులను ప్రాణాయామములు యోగాసనములు ద్వారా నివారించేందుకు శిక్షణ ఇస్తామన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా యోగ శిక్షణ తో పాటు చికిత్స చేస్తారన్నారు. మహిళలకు ప్రత్యేకంగా మహిళల శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఈనెల 11వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటలకు తిలక ధారణ, 10 గంటలకు పురవీధులలో శోభాయాత్ర, అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు భోజన ప్రసాద వినియోగం ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో యోగా గురువులు జి గురునాథ్ బాబు, మద్దాల చింతయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి యమ్.వెంకటేశ్వర ప్రసాద్, యోగ సభ్యులు ఆర్ దుర్గాప్రసాద్, జగన్మోహన్రావు పాల్గొన్నారు.

