నిర్దిష్ట ప్రణాళికతో పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధ్యమేనని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం నగర పరిధిలోని కృష్ణా విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన మార్చ్ 2026 పదవ తరగతి విద్యార్థుల వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. దీనికోసం ప్రతి పాఠశాలకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించామని, వారు వారికి కేటాయించిన పాఠశాలను సందర్శించి, పదవ తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి అని సూచించారు. ముఖ్యంగా ప్రతి అధికారి, వారి పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి జాబితా తయారు చేయాలని, వారు ఏఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో సంబంధిత తరగతి ఉపాధ్యాయుల సహకారంతో తెలుసుకుని, దాని ప్రకారం ఆ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
కేవలం స్లిప్ టెస్ట్ లు మాత్రం పెట్టడమే కాకుండా ఆ విద్యార్థి చదువులో వెనుక పడటంలో ఉన్న ప్రతికూల కారకాలు తెలుసుకోవాలని, ముఖ్యంగా కుటుంబ పరంగా విద్యార్థిని ఏమైనా కలవరపెట్టే అంశాలు ఉన్నా వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, అవసరమైతే పరీక్షాకాలం సమయంలో అటువంటి విద్యార్థులను బంధువుల గృహాల్లో ఉంచే విధంగా చూడాలన్నారు. తద్వారా ఆహ్లాదకర వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్థులు ప్రశాంతంగా చదివి ఉత్తీర్ణత పొందుతారని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.