ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన
SSN
- December 31, 2025
- 0 min read
[addtoany]
మచిలీపట్నం :
గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
అరిసేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హుస్సేన్ పాలెం గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర వైద్య భవన నిర్మాణానికి బుధవారం మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ బండి రామకృష్ణ, తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి పనులను చేపడుతుందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిని చూపిస్తూ పబ్లిక్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి నిధులు సమకూర్చిందని, ఆ విధంగా గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో వైద్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి దాదాపు రూ.112 కోట్ల నిధులను పంచాయతీరాజ్ ద్వారా తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. పోలాటితిప్ప, గరాలదిబ్బ, బందరు కోటకు రెండు వంతెనలు, అదేవిధంగా మోడి వద్ద మరో వంతెన నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
సాస్కీ కింద రూ.20 కోట్లు, ఆర్ అండ్ బి కింద రూ.18 కోట్ల నిధులు నియోజకవర్గానికి మంజూరైనట్లు తెలిపారు. అర్సేపల్లి పంచాయతీకి ఇప్పటివరకు వివిధ అభివృద్ధి పనుల కోసం దాదాపు 2.99 కోట్ల నిధులను ఖర్చు చేసినట్లు మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రామంలోనే ఏర్పాటవుతున్న హెల్త్ సెంటర్ తో ఇబ్బందులు తీరుతాయని, సెంటర్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ అథారిటీ డైరెక్టర్ లంకే నారాయణ ప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు సాయిరాం, మాదివాడ రాము, గడ్డం రాజు, మధుసూదన్ రావు, సోమశేఖర్, విద్యాసాగర్, వైద్యులు, వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

