MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

మీకోసం—- ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 152 అర్జీలు

  • December 29, 2025
  • 1 min read
[addtoany]
మీకోసం—- ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 152 అర్జీలు
మచిలీపట్నం :
 
       సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కేఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డి.ఎస్.పి శ్రీనివాసరావులతో కలసి మీకోసం—- ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 
 
 కలెక్టరేట్లో మొత్తం 152 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి: 
 
గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన గుండా పండుబాబు తనకు 2023లో గన్నవరం విమానాశ్రయం ఎదురుగా లారీ ప్రమాదం జరిగి కాలు పోయిందని, తాను మొబైల్ దుకాణం నడుపుకుంటున్నానని, 85% సదరం వికలత్వ ధ్రువీకరణ పత్రం డాక్టర్లు ఇచ్చారని, వికలాంగుల పింఛను కోసం గత 2 సంవత్సరాలుగా తిరుగుతున్న రాలేదని, ఇకనైనా దయచేసి వికలాంగుల పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
 
గన్నవరంకు చెందిన తిరివీధి లక్ష్మి, లాం లలిత మాట్లాడుతూ తాము ఎస్సీ కాలనీకి చెందిన వారమని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నామని తమ ప్రమేయం లేకుండానే తమ పేరుతో బ్యాంకు రుణాలు సంఘం లోని ఇతర సభ్యులు తీసుకున్నారని తమకు ఇవ్వలేదని, ఇందులో ఏపిఎం, సి.సి., పుక్కి బుక్ కీపర్ ఒకటై ఇదంతా జరిగిందని ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. 
 
కృష్ణాజిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో వంట గ్యాస్ వినియోగదారులకు సిలిండర్ను ఇంటి వద్ద డెలివరీ చేసిన సమయంలో కాటా పెట్టి ఇచ్చేవారని, ప్రస్తుతం ఈ పద్ధతి అమల్లో లేకపోవడంతో సిలిండర్లో వంట గ్యాస్ తక్కువగా ఉండడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని, గతంలో మాదిరిగా మరల వంట గ్యాస్ వినియోగదారులకు తూకం చూపించి ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. 
 
 
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి పవన్ కుమార్, సహాయ కార్యదర్శి అజ్మీరా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించి బలోపేతం చేయాలని, పనిదినాలు 100 రోజులకు నుంచి 200 రోజులకు పెంచాలని, కనీస వేతనం 700 రూపాయల కంటే తక్కువ కాకుండా చూడాలని, వేతనాలు రోజువారి లేదా వారాంతపు చెల్లింపులతో ఆలస్యం లేకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికైనా పదోన్నతులు కానీ, ఇంక్రిమెంట్లు గానీ ఇవ్వవలసిన ఉంటే వాటికి సంబంధించి ఉత్తర్వులు సిద్ధం చేయాలని, వారికి నూతన సంవత్సర సందర్భంగా జనవరి ఒకటో తేదీన ఆ ఉత్తర్వులు అందజేసే ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాకుండా ఏ కార్యాలయంలోనైనా ఏమైనా సమస్యలు ఉంటే ఉద్యోగులను పదేపదే తిప్పుకోకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. 
 
వచ్చే 2026 నూతన సంవత్సరం ఎవరు కూడా పూల బొకేలు గానీ మిఠాయిలు గాని తీసుకురావద్దని అవసరమైన వారికి కాస్త సహాయం చేయాలని హితవు పలుకుతూ, ఈసారి వినూత్నంగా “కృష్ణ సంకల్పం” పేరుతో బాలికల కోసం శానిటరీ నాప్కిన్ ఇన్సినిరేటర్లు, క్రింద కూర్చుని చదువుకునే విద్యార్థులకు ఎత్తయిన బల్లలు వంటి సౌకర్యాలను అందించేందుకు ముందుకు రావాలన్నారు.
పిఎం ఎఫ్ఎంఈ , పి ఎం ఈజిపి పథకాల కింద ఏమైనా సమస్యలు ఇంకా ఆపరిష్కృతంగా ఉన్నాయా అని విచారిస్తూ… జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాల సదుపాయాలు కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎటువంటి అంతరాలు లేకుండా సకాలంలో అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇచ్చిన లక్ష్యాలను జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తో సమన్వయం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలోని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 
 
కలెక్టరేట్లో ” అమృత కృష్ణ ” పేరుతో సంక్రాంతి లోపే శుద్ధ నీటిజలం కేంద్రాన్ని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 
 
గూడూరు మండలం పిన గూడూరు లంక లో ఆదర్శ రైతు విజయరామ్ నిర్వహిస్తున్న సౌభాగ్యం నమూనా అర్హాలు సేద్యం చేయుటకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక రైతులను పెద్ద ఎత్తున గుర్తించి శిక్షణ ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సూచించిన విధంగా ఇతర జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను మన జిల్లాకు అనువుగా అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి సజావుగా అమలయ్యేలా చొరవ చూపాలన్నారు. 
ఎనికె పాడు సొరంగం మూసివేయకముందే దాని దిగువనున్న అన్ని వేసవి మంచినీటి చెరువులను పూర్తిగా నింపుకోవాలన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
కీలక పనితీరు సూచికలు (కేపిఐ) ఇతర జిల్లాలతో సరిపోల్చుకొని లోతుగా అధ్యయనం చేసి డేటా వివరాలు సరిగా అప్లోడ్ చేశారా లేదా గమనించుకోవాలన్నారు. 
 
 ఈసారి జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం అయినందున ముందుగానే ఈనెల 31వ తేదీన బుధవారం నాడు లబ్ధిదారులందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని, ఇందుకోసం ముందుగానే కావలసిన నిధులను బ్యాంకుల నుండి తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 
 
గృహ నిర్మాణ పథకంలో దశలవారి పురోగతి ఎప్పటికప్పుడు సాధించేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొంది విజయవంతంగా నడుస్తున్న యూనిట్ల వివరాలను సిద్ధం చేయాలన్నారు. 
 
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డ్వామా, డి ఆర్ డి ఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డిఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఉద్యాన అధికారి జే.జ్యోతి, డిపిఓ డాక్టర్ జై అరుణ, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *