జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ వినియోగించుకుని మత్స్య సంపదను పెంపొందించే దిశగా ప్రత్యేక దృష్టి సారించి మత్స్యకారులకు పెద్ద ఎత్తున జీవనోపాదులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ వినియోగంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్లైమేట్ ఫండ్ పేరుతో జిల్లాలో మత్యసంపద పెంపొందించేందుకు నిధులు కేటాయించిందన్నారు. ఈ నిధులతో పీతలు, సముద్ర నాచు, అలంకార చేపలు పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని అధికంగా ఆదాయం పొందే జీవనోపాదులు మెండుగా ఉన్నాయన్నారు.
జిల్లాలో 27 పీతల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయవలసి ఉందని, ఒక్కో యూనిట్ విలువ 19,400 రూపాయలని, 64 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. పీతల పిల్లల కోసం ఆర్ జి సి ఐ కి ఇండెంట్ పెట్టాలన్నారు. వచ్చే ఫిబ్రవరి మాసం రెండవ వారంలో యూనిట్లు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కేటాయించిన 9 లక్షల రూపాయలకు సంబంధించి వినియోగ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసి పంపాలన్నారు.
జిల్లాలో 25 సముద్ర నాచు పెంపకం యూనిట్ల కోసం 80 మంది సిద్ధంగా ఉన్నారని, ఒక్కో యూనిట్ విలువ11,662 రూపాయలని, వెండారుకు జనవరి మొదటి వారంలో చెల్లింపులు చేయాలన్నారు. అలంకార చేపలు యూనిట్ విలువ 45,948 రూపాయలని, కృత్తివెన్ను మండలంలో 10 మంది గుర్తించిన లబ్ధిదారులకు జనవరి మొదటి వారంలో యూనిట్లు మొదలయ్యేలా చొరవ చూపాలన్నారు.
వచ్చే సంవత్సరం మరో 500 పీతల పిల్లల పెంపకం యూనిట్లు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే మార్చి మాసంలోగా కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయుటకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాలన్నారు. జనవరి 4 వ తేదీన మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజు, డీఎఫ్ఓ సునీత, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉష ,జిల్లా సమన్వయకర్త ప్రభాకర్ రావు పాల్గొన్నారు.