గ్రామాల్లో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్తబుట్టలతో ఈ – ఆటోలు, తోపుడుబండ్లను ఏర్పాటు చేశామని, తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చెత్త సేకరణ ఈ–ఆటోలు, తోపుడుబండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, డిపిఓ డా. జే అరుణ స్వయంగా ఈ–ఆటోలను నడిపి అందరిని ఆకర్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10 సూత్రాల అమలు ద్వారా వచ్చే 2047 సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీసిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.
ఇందులో ఒక కీలకమైన సూత్రం స్వచ్ఛ ఆంధ్ర అని అంటూ ఇందులో భాగంగా ప్రతి పల్లెటూర్లోనూ వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. ఇది చాలా శాస్త్రీయంగా ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమం అన్నారు.
జిల్లాలో 8 ఈ—ఆటోలు, 171 తోపుడు బండ్లను చెత్త సేకరణ కోసం గ్రామాలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కలిగి వాటిని వేరుచేసి చెత్త సేకరణకు వచ్చే పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. ఇందుకోసం ప్రతి ఈ- ఆటోలోనూ, తోపుడుబండ్ల లోను వేరువేరు రంగులతో చెత్తబుట్టలు ఏర్పాటు చేశామన్నారు.
అందులో ఆకుపచ్చ రంగు చెత్త బుట్టలో తడి చెత్త, ఎరుపు రంగు చెత్త బుట్టలో హానికర వస్తువులు, నీలం రంగు చెత్తబుట్టలో పొడి చెత్త వేయాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఓ డాక్టర్ జె అరుణ, డి ఎల్ పి ఓ రహంతుల్లా, ఏవో సీతారామయ్య పలువురు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.