MachilipatnamLocal News
November 25, 2026
మచిలీపట్నం

ఆత్మగౌరవంతో అంతిమ సంస్కారాలు: రూ. 3.25 కోట్లతో ‘వైకుంఠ మహా ప్రస్థానం’ ప్రారంభం

  • November 24, 2026
  • 1 min read
ఆత్మగౌరవంతో అంతిమ సంస్కారాలు: రూ. 3.25 కోట్లతో ‘వైకుంఠ మహా ప్రస్థానం’ ప్రారంభం

గ్రీన్‌కో, ఫీనిక్స్ సంస్థల సీఎస్ఆర్, మున్సిపల్ నిధులతో శ్మశాన వాటిక ఆధునీకరణ

మచిలీపట్నం:

నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అంతిమ సంస్కారాలను ఆత్మగౌరవంతో నిర్వహించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్మశాన వాటికను అభివృద్ధి చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం మచిలీపట్నం 59వ డివిజన్ పరిధిలోని బైపాస్ రోడ్డు (టెంపుల్ కాలనీ–పంబలగూడెం) వద్ద రూ. 3.25 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ‘వైకుంఠ మహా ప్రస్థానం’ ను ఆయన ప్రారంభించారు.

మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పాటు గ్రీన్‌కో సంస్థ సీఎస్ఆర్ నిధులు, ఫీనిక్స్ ఫౌండేషన్  సహకారంతో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, గ్రీన్‌కో సంస్థ ప్రతినిధి చలమలసెట్టి అనిల్ కుమార్, ఫీనిక్స్ సంస్థ ప్రతినిధి చుక్కపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

2.90 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో కనీస సదుపాయాలు ఉండేవి కావని, గతంలో కొల్లూరి కృష్ణారావు కొంతమేర అభివృద్ధి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం దాదాపు 2.90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో 1.90 ఎకరాలను హిందూ అంత్యక్రియలకు, మరో ఎకరాన్ని క్రైస్తవ సమాధుల కోసం కేటాయించినట్లు వివరించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన చుక్కపల్లి సురేష్‌కు, గ్రీన్‌కో మరియు ఫీనిక్స్ సంస్థల ప్రతినిధులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వైకుంఠ ధామంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులు

అంత్యక్రియలకు వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ క్రింది వసతులను ఏర్పాటు చేశారు.

* దహన వేదికలు & నిరీక్షణ మందిరాలు: మూడు ఆధునిక దహన వేదికలు, వాటికి ఎదురుగా 50 కుర్చీల సామర్థ్యంతో మూడు నిరీక్షణ మందిరాలు.
* భోజనశాల & ప్రత్యేక గదులు: బంధువుల కోసం ఒకేసారి 60 మంది కూర్చునేలా భోజనశాల, పిండప్రదానాల కోసం రెండు ప్రత్యేక గదులు, అస్థికలు భద్రపరిచే గది, కార్యాలయం, స్టోర్ రూమ్ మరియు క్షౌరశాల.
* కోల్డ్ స్టోరేజ్ & విద్యుత్: మృతదేహాలను భద్రపరిచేందుకు రెండు కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం 15 కేవీఏ జనరేటర్.
* ఇతర సదుపాయాలు: దహన సంస్కారాలకు అవసరమైన కలప నిల్వ చేసేందుకు ప్రత్యేక షెడ్, పురుషులు మరియు మహిళలకు వేర్వేరుగా మరుగుదొడ్లు.

About Author

SSN