MachilipatnamLocal News
November 24, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం నగర మేయర్‌గా అబ్దుల్ అబీద ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ మేయర్‌గా కొట్టే అంకా వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక

  • November 24, 2026
  • 1 min read
మచిలీపట్నం నగర మేయర్‌గా అబ్దుల్ అబీద ప్రమాణ స్వీకారం.. డిప్యూటీ మేయర్‌గా కొట్టే అంకా వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక

మచిలీపట్నం: 

మచిలీపట్నం నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మరియు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ సోమవారం ఘనంగా జరిగింది. నగరంలోని రేవతి సెంటర్ సమీపంలో ఆర్కే గుడ్ టైమ్స్ వెనుక ఉన్న నూతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి. అభిషేక్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి, నూతనంగా ఎన్నికైన మేయర్ మరియు కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మేయర్, 60 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

తొలుత నగర ప్రథమ పౌరురాలిగా ఎన్నికైన మేయర్ అబ్దుల్ అబీద ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెలుగు అక్షరమాల క్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ అన్నం శ్రీ ఆనంద్‌తో మొదలై 16వ డివిజన్ కార్పొరేటర్ హసీం బేగ్ వరకు మొత్తం 60 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. వీరిలో

టీడీపీ: 34 మంది

జనసేన: 13 మంది

వైఎస్సార్‌సీపీ: 9 మంది

స్వతంత్రులు: 3 గురు

బీజేపీ: 1 ఒకరు

డిప్యూటీ మేయర్‌గా కొట్టే అంకా వెంకట్రావు

ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. 10వ డివిజన్ కార్పొరేటర్ కొట్టే అంకా వెంకట్రావు పేరును 18వ డివిజన్ కార్పొరేటర్ రామానుజవరపు సమతా కీర్తి ప్రతిపాదించగా, 58వ డివిజన్ కార్పొరేటర్ వడ్డీ చిరంజీవి కుమార్ బలపరిచారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో కొట్టే అంకా వెంకట్రావు ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ప్రకటించి, అభినందనలు తెలిపారు.

స్వచ్ఛ మచిలీపట్నం కోసం సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్ డీకే బాలాజి 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ, మేయర్ అబ్దుల్ అబీద నాయకత్వంలో ఏర్పడిన నూతన పాలకవర్గం నగర అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ప్లాస్టిక్ రహిత వేదిక: కౌన్సిల్ సమావేశ మందిరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ వాటర్ బాటిళ్లు, స్టీల్ ప్లేట్లు మరియు పునర్వినియోగ గ్లాసులను వినియోగించి పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ వివరించారు.

ప్రజల్లో అవగాహన: ఇదే స్ఫూర్తితో కార్పొరేటర్లు తమ వార్డులలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజల భాగస్వామ్యంతో మచిలీపట్నాన్ని స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN