MachilipatnamLocal News
October 17, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం మేయర్ కూటమి అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబీదా.. జనసేన నేతల సంపూర్ణ మద్దతు

  • October 17, 2026
  • 0 min read
మచిలీపట్నం మేయర్ కూటమి అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబీదా.. జనసేన నేతల సంపూర్ణ మద్దతు

 * నగరాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్న అబీదా బేగం

 * అధినాయకత్వానికి, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు

మచిలీపట్నం:

స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు హసీంబేగ్ సతీమణి షేక్ అబ్దుల్ అబీదా పేరును అధికారికంగా ప్రకటించారు.

నాయకత్వానికి ధన్యవాదాలు

తనపై నమ్మకంతో మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకుగానూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిలకు షేక్ అబ్దుల్ అబీదా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జనసేన నేతల మర్యాదపూర్వక కలయిక – సంపూర్ణ మద్దతు

మేయర్ అభ్యర్థిగా ఎంపికైన అనంతరం షేక్ అబ్దుల్ అబీదా, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ హసీం బేగ్ దంపతులు శనివారం జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల సమన్వయకర్తలు మండలి వెంకట్రామ్, బండి రామకృష్ణ, చిలకలపూడి పాపారావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థికి జనసేన నేతలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి, తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

నగరాభివృద్ధే ధ్యేయం

ఈ సందర్భంగా అబీదా బేగం మాట్లాడుతూ.. మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి, అందరి సహకారంతో నగరాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి, మేయర్ అభ్యర్థిగా తనతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ హసింబేగ్, నగరానికి చెందిన పలువురు కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

SSN